ఉద్యోగం పోయిందని.. బస్సు హైజాక్!!
(జి.వి.నారాయణరావు - సాక్షి, రంపచోడవరం)
ఉద్యోగం పోయిందన్న కోపంతో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ మాజీ డ్రైవర్ ఓ బస్సును హైజాక్ చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది. రాజవొమ్మంగికి చెందిన సీహెచ్ వెంకన్న గతంలో ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేశారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గుర్తేడు వెళ్లేందుకు గోకవరం బస్టాండు పాయింట్లో సిద్ధంగా ఉన్న బస్సును హైజాక్ చేసి, డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కొంతసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన గోకవరం డిపో మేనేజర్.. బస్సు రంపచోడవరం వైపు వెళ్తున్నట్లు తెలుసుకుని, రంపచోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కాపుకాసి.. బస్సును ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద ఆపి, వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బస్సును గోకవరానికి తరలించారు. వెంకన్న గతంలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేశారు. తర్వాత పదోన్నతిపై ఆయనను అడ్మినిస్ట్రేషన్ విభాగంలోకి మార్చారు. అయితే అక్కడ ఆయనపై లక్ష రూపాయలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆ మొత్తాన్ని ఆయన తిరిగి కట్టేశారు. అయినా తిరిగి ఉద్యోగంలోకి మాత్రం తీసుకోలేదు. డబ్బు కట్టినా ఉద్యోగం రాలేదన్న కోపంతో బస్సను హైజాక్ చేసినట్లు వెంకన్న అంగీకరించారు.