
ఈహెచ్‌పీ వ్యాధి సోకిన వెనామీ రొయ్యలు
తూర్పుగోదావరి, అమలాపురం: వరుసగా రెండేళ్ల నుంచి సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులకు ఈ ఏడాది కూడా కాలం కలసిరావడం లేదు. ఆరంభంలోనే ఆక్వా సాగును తెగుళ్లు చుట్టుముడుతున్నాయి. గత ఏడాది రెండో పంటను దెబ్బ తీసిన ఎన్ట్రోసైటోజూన్ హెపటోప్నియా (ఈహెచ్‌పీ) వ్యాధి ఈ ఏడాది ఆరంభంలోనే పంజా విసురుతుండడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. గత ఏడాది ఆక్వా రెండు పంటలను రైతులను ముంచేశాయి. తొలి పంటను కొనుగోలుదారులు సిండుకేటుగా మారి ముంచేస్తే.. రెండో పంటలో హేచరీలు ఆ పాపానికి ఒడిగట్టాయి. తాజాగా ఈ ఏడాది తొలి పంటను సైతం రైతులకు నాశిరకం సీడ్ అందజేస్తున్న హేచరీల వల్ల నష్టపోతున్నారు.
జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు పైబడి వెనామీ సాగు జరుగుతుందని అంచనా. 90 శాతం ఆక్వా చెరువుల్లో సాగు ప్రారంభమైంది. చాలాచోట్ల సాగు మొదలై నెల రోజులు కావస్తోంది. తొలి పంట కావడంతో రైతులు చెరువుల సామర్థ్యానికి మించి రొయ్య పిల్లల పెంపకం ప్రారంభించారు. ఎకరాకు 1.5 లక్షల వరకు రొయ్య పిల్లలను వదులుతున్న రైతులు గణనీయంగా ఉన్నారు.
ఈ ఏడాది కూడా రైతులకు తెగుళ్ల బెడద తప్పలేదు. రొయ్యల రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈహెచ్‌పీతోపాటు వైట్‌కట్ వైరెస్, వైట్‌స్పాట్ కోస్తా రొయ్యల సాగుకు పెనుముప్పుగా మారాయి. విబ్రియో, వైట్‌స్పాట్ కూడా ఎక్కువగానే ఉంది. వీటిలో ఈహెచ్‌పీ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇది ఒక ఫంగల్ డిసీజ్ అన్నారు. దీని వల్ల ఎదుగుదల లోపం ఏర్పడుతుంది. రెండు నెలలకు గాను 12 గ్రాములు రావాల్సిన రొయ్యలు కేవలం 2 గ్రాముల బరువు వస్తున్నాయి. పైగా వీటిలో కూడా మూడు రకాల సైజులుంటున్నాయి. వెనామీలో రోజులు గడిచే కొద్దీ అంటే కౌంట్ తగ్గే కొద్దీ మేత వాడకం పెరుగుతోంది. దాని తగినట్టుగా బరువు రాకుంటే రైతుల నష్టాలు రెట్టింపవుతాయి.
నాసిరకం సీడ్
హేచరీల నుంచి నాసిరకం రొయ్య పిల్లలు (సీడ్) రావడంతో పలురకాల వాధ్యులు సోకుతున్నాయి. దీంతోపాటు వైట్‌కట్ బ్యాక్టీరియల్ తెగులు కూడా ఎక్కువగానే ఉంది. ఇక వైట్‌స్పాట్ ఎలాను ఉంది. వీటిని అరికట్టే అవకాశం లేకపోవడంతో ఇవి సోకిన చెరువులను రైతులు ధ్వంసం చేస్తున్నారు. పట్టుబడి చేద్దామన్నా సాగు ఆరంభంలోనే ఉండటం వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో సాగు ఆరంభించిన ఆక్వా చెరువుల్లో 30 శాతం వరకు అంటే 7,500 ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా. నియంత్రణ లేని హేచరీలు రైతులను నిలువునా ముంచేస్తున్నా మత్స్యశాఖ గానీ, కోస్టల్ ఆక్వా అథార్టీ (సీఏఏ)గానీ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అసలు హేచరీల్లోనే వ్యాధులు ఉండటం, వాటి ద్వారా ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని రొయ్య పిల్లలను తమకు అందచేస్తుండటం దుర్మార్గమని రైతులు వాపోతున్నారు. హేచరీలు సొమ్ము చేసుకుంటుంటే తాము నష్టాలను చవి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment