
అర్హులందరికీ పింఛన్లు అందాలి
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో చూడాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని 5, 6 డివి జన్లలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, డిప్యూటీ మే యర్ ద్వారకానాథ్‌తో కలసి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు జీవనాధారం కోసం పింఛన్లపై ఆధారపడుతున్నారన్నారు.
గతంలో నెలకు రూ.75 ఉన్న పింఛన్‌ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.200 చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని రూ.1000కి పెంచడం అభినందనీయమన్నారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా అధికారులు, ప్రజా ప్రతి నిధులు కృషి చేయాలన్నారు. 2019 సంవత్సరానికి ప్రతి పేద ఇంటికి మరుగుదొడ్లు ఉండేలా చూడాలని ప్రధాన మంత్రి చేపట్టిన కార్యక్రమం కూడా బాగుందన్నారు.
సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాను పర్యటించిన అర్హులైన తమ పింఛన్లు తీసివేశారని, చాలా మంది తనకు చెప్పారని అన్నారు. అలాంటి వారిని చూసిన వెంటనే ఎటువంటి పరీక్షలు చేయకుండానే వారు వృద్ధులని, పూర్తిగా వికలాంగులని తెలుస్తున్నప్పటికీ నిబంధనల పేరుతో అర్హులైన చాలా మంది పింఛన్లను తీసివేశారన్నారు.
ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుల్లో ఉన్న చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి పింఛన్లు తీసివేశారని అన్నారు. ఆ పింఛన్‌దారులు ఆ తప్పుల సవరణ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.
పింఛన్లు అందజేసే అధికారులు పింఛన్‌దారులను హేళన చేస్తూ మాట్లాడడం తగదని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ డివిజన్‌లో చాలా మంది అర్హులైన వారికి పింఛన్లు అందలేదన్నారు. పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.1000కు పెంచిన ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు.