ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ఎగువ ప్రాంతాలనుంచి వచ్చే వరద నీరు, మట్టితో పూడిక పేరుకుపోతోంది. ఇప్పటికే సుమారు 34 టీఎంసీల మేర పూడిక చేరి ఉంటుందని భావిస్తున్నారు. పూడికపై సర్వే చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పకడ్బందీగా సర్వే నిర్వహించి ఎంత మేరకు పూడిక పేరుకుపోయిందో తేల్చాలని, పూడికను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ఠబాల్కొండ, న్యూస్‌లైన్ :
ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కాగానే 1970లో హైడ్రో గ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 112.02 టీఎంసీలుగా నిర్ధారించింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు, మట్టితో ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతోంది. 1994 లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబరెటీస్ (ఏపీఈఆర్‌ఎల్) సంస్థ సర్వే చేసి ప్రాజెక్టులోకి 21.71 టీఎంసీల పూడిక వచ్చి చేరిం దని తేల్చింది. అంటే 1994 నాటికి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలకు పడిపోయిందన్నమాట. 2006లో అదే ఏపీఈఆర్‌ఎల్ సర్వే జరిపి ప్రాజెక్టులో 32 టీఎంసీల పూడిక పేరుకుపోయిందని నివేదిక ఇచ్చింది. లెక్క ప్రకారం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 79.96 టీఎంసీలకు పడిపోయినట్లు కాగా, ఈ నివేదిక నమ్మశక్యంగా లేదని అధికారులు కొట్టిపారేశారు. పూడికపై 1994లో ఏపీఈఆర్‌ఎల్ సంస్థ ఇచ్చిన నివేదిక ను నమ్మిన ప్రాజెక్టు అధికారులు.. 2006లో ఇచ్చిన రిపోర్టు నమ్మశక్యంగా లేదని అంటున్నారు.
ఏటా 0.8 టీఎంసీల పూడిక
1970 నుంచి 1994 వరకు 24 ఏళ్లలో 21.71 టీఎంసీల పూడిక చేరింది. 1994 నుంచి 2006 వరకు 12 ఏళ్లలో 10 టీఎంసీల పూడిక చేరినట్లు సర్వే తేల్చింది. ప్రాజెక్టులోకి ఏటా ఎగువ ప్రాంతాల నుంచి 0.8 టీఎంసీల పూడి క వచ్చి చేరుతుందని అధికారుల సర్వే రికార్డులు చెబుతున్నాయి. వారి లెక్కల ప్రకారం 36 ఏళ్లలో 28.8 టీఎంసీల పూడిక చేరుతుం ది. 24 టీఎంసీల పూడిక చేరిందని 2006లో ఏపీఈఆర్‌ఎల్ సంస్థ ఇచ్చిన నివేదికను ప్రాజె క్టు అధికారులు ఎందుకు తిరస్కరించారో అర్థంకాని పరిస్థితి. అయితే ప్రాజెక్టులో ఇంత భారీగా పూడిక చేరిందని తెలిస్తే రైతులనుంచి ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడిన అధికారులు.. సర్వే రిపోర్టును తిరస్కరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా అధికారులు మళ్లీ అదే సంస్థతో ప్రస్తుతం సర్వే చేయిస్తుండడం గమనార్హం. వారం రోజుల్లో సర్వే ప్రారంభం కానుంది.
పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే..
పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎస్సారెస్పీ వట్టిపోయే పరిస్థితి ఏర్పడుతోంద న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1963లో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకుంది. సుమారు 18 లక్షల ఎకరాలకు సాగు నీరు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు తాగు నీరు అందిస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా మారింది. అయితే ఈ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పూడిక పేరుకుపోతుండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. పూడికతీత విషయమై అధికారులు గతంలో ఓసారి విదేశీ బృందాలను పిలిపిం చారు. పూడికను రసాయనాలతో కరిగించి, ప్రాజెక్టు వరద గేట్ల కింద అమర్చిన షిల్ట్ గేట్ల ద్వారా వదలాలని వారు సూచించారు. అయి తే షిల్ట్ గేట్లు సైతం మట్టిలోనే కూరుకుపోయాయని, అందువల్ల పూడికతీత సాధ్యపడలేదని పేర్కొంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఇప్పటివరకు వేల టీఎంసీల నీటిని గోదావరి నదిలోకి వదిలినా.. ఒక్కసారి కూడా షిల్ట్ గేట్లను ఎత్తకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతులు ఆరోపిస్తున్నారు. దాని ఫలితంగానే ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు వేదికి, ప్రాజెక్టులోంచి పూడిక తొలగించాలని కోరుతున్నారు.
పకడ్బందీగా సర్వే చేయిస్తాం
ఏపీఈఆర్‌ఎల్ ప్రభుత్వ సంస్థ. అయితే గతంలో ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికపై నిర్వహించిన సర్వేలో పొరపాట్లు జరిగాయి. ఈసారి అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పకడ్బందీగా సర్వే చేయించి, ప్రాజెక్టులో ఎంతమేర పూడిక పేరుకుపోయిందో తేలుస్తాం. -శ్యాంసుందర్, ప్రాజెక్టు ఎస్‌ఈ
పూడుకుపోతున్న ఎస్సారెస్పీ
Published Tue, Dec 17 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
Advertisement
Advertisement