పకడ్బందీగా జన్మభూమి-మాఊరు
కర్నూలు(అగ్రికల్చర్):
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జన్మభూమి- మాఊరు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామని కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ అన్ని శాఖల అధికారులను కోరారు. సోమవారం ఈ కార్యక్రమంపై కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 2 నుంచి 20వరకు పంచాయతీల వారీగా చేపట్టాల్సిన అంశాలపై నివేదికలు తయారు చేయాలన్నారు. 2న జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల్లోను ఈ కార్యక్రమంపై ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. కర్నూలులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించే బాధ్యతను మునిసిపల్ కమిషనర్, మెప్మా డీఆర్‌డీఏ పీడీలకు అప్పగించారు. ఎంతమంది డాక్టర్లు ఉంటారు, మందులు ఏవేవి అందుబాటులో ఉంటాయనే అంశాలపై సమగ్రమైన ప్రణాళిక ఇవ్వాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ అధికారులు పశువైద్య శిబిరాలు అన్ని గ్రామ పంచాయతీల్లో జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పింఛన్లను పరిశీలించాలని తెలిపారు. నిరుపేద కుటుంబాలు అదనపు ఆదాయాన్ని పొందే మార్గాలను సంక్షేమాధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అన్వేషించాలని సూచించారు. బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. ఏపీఎంఐపీ అటవీశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్ తదితర అన్ని శాఖలకు సంబంధించి సూక్ష్మ ప్రణాళికలు ఉండాలన్నారు.
డీఎంహెచ్‌ఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలపై ఆగ్రహం
సమావేశానికి డీఎంహెచ్‌ఓ నరసింహులుతో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు హాజరు కాలేదు. డీఎంహెచ్‌ఓ వైద్య ఆరోగ్య మంత్రి వెంట కడప వెళ్లినట్లు తెలుసుకొని డీఎంహెచ్‌ఓ పరిధి ఎంత.. వెంటనే పిలిపించండి అంటూ సిబ్బందిని ఆదేశించారు. ఇద్దరు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు సెలవులు పెట్టారని సిబ్బంది చెప్పగా వెంటనే వెనక్కి పిలిపించాలని, రెండు గంటల్లో వారు నా దగ్గర ఉండాలని ఆదేశించారు. కాగా ప్రజావాణి వెబ్‌సైట్‌ను ప్రతిరోజు పరిశీలించుకొని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. జేసీ కన్నబాబు, ఏజేసి అశోక్‌కుమార్, డీఆర్‌ఓ వేణుగోపాల్ రెడ్డి,(అప్పటికి బాధ్యతల నుండి రిలీవ్ కాలేదు), సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఠాగూర్ నాయక్, డీఆర్‌డీఏ పీడీ నజీర్ సాహెబ్ పాల్గొన్నారు.