సైనికుడు.. 130 కోట్ల మంది భారతీయులకు రక్షణ కవచంలా ఉంటూ.. తన కుటుంబానికి దూరంగా గడిపే శ్రామికుడు. అలాంటి జవాన్ గురించి ఎంత పొగిడినా తక్కువే. ప్రాణాల్ని పణంగా పెడుతూ.. దేశం కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీలో సేవల్ని గుర్తిస్తూ ర్యాంకులు ఇస్తుంటారు.ప్రభుత్వం తరఫున వారు పొందే ర్యాంకులు, పతకాల గురించి ఆర్మీ డే సందర్భంగా తెలుసుకుందాం..
విశాఖపట్నం: దాయాది దేశం పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధానికి ఆర్మీ రంగానికి సారథ్యం వహించిన ఆర్మీ చీఫ్ ఎస్‌హెచ్‌ఎఫ్‌జె మానిక్‌షా. యుద్ధ రంగంలో ఆయన చూపిన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా రక్షణ శాఖలో తొలిసారిగా ఫీల్డ్ మార్షల్ హోదాను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రక్షణ శాఖలో అత్యున్నత స్థానం కూడా ఫీల్డ్ మార్షల్ హోదానే. 1973 జనవరి 1వ తేదీన ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన మానిక్ షా 15 రోజుల తర్వాత పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన కేఎం కరియప్పకు ఈ హోదాను అందించారు. రక్షణ రంగంలో ఆర్మీ విభాగంలో లెఫ్టినెంట్ హోదా నుంచి జనరల్ వరకూ పదోన్నతులు ఉంటాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే...
జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో)
ఆర్మీలో ద్వితీయ శ్రేణి ర్యాంకింగ్‌లో మొదటిది జేసీవో. ద్వితీయ శ్రేణి ర్యాంకింగ్‌లో ఉన్న వారందరినీ జేసీవోలుగా పిలుస్తారు. బ్రిటిష్ పాలకులు రాజ్యమేలుతున్న సమయంలో భారతీయ సిపాయిలకు ఆదేశాలు జారీ చేసే విషయంలో తలెత్తిన ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఈ క్యాడర్‌ను ప్రవేశపెట్టారు.
నాన్ కమిషన్డ్ ఆఫీసర్ (ఎన్‌సీవో)
మూడో శ్రేణి అధికారి స్థాయిలో ఉన్న వారందరినీ నాన్ కమిషన్డ్ ఆఫీసర్లుగా పిలుస్తారు. ప్రతిభావంతులు, సీనియారిటీ ప్రాతిపదికన జవాన్లకు ఎన్‌సీవో ర్యాంకుని కేటాయిస్తారు. ప్రపంచంలోని కామన్వెల్త్ దేశాలన్నింటిలోనూ ఈ ర్యాంకు ఉంది. కుడి భుజానికి మాత్రమే వారు తమ బ్యాడ్జీలను ధరిస్తారు. ఆ తర్వాత కంపెనీ హవాల్దార్, మేజర్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవాల్దార్, రెజిమెంటల్ క్వార్టర్ మాస్టర్ హవాల్దార్, రెజిమెంటల్ హవాల్దార్ మేజర్లు బ్యాడ్జీలను ధరిస్తారు.
♦ ఇన్‌ఫెన్‌ట్రీ దళాల్లో హవాల్దార్ నాయక్, లాన్స్ నాయక్, సిపాయిలు ఉంటారు.
♦ సాయుధ దళాల్లో దఫేదార్, లాన్స్ దఫేదార్, యాక్టింగ్ లాన్స్ దఫేదార్, సోపర్‌లు ఉంటారు.
♦ ప్రతి కంపెనీలో సీనియర్ హవాల్దార్‌లు ఇద్దరు, నాయక్‌లు 10 మంది, హవాల్దార్‌లు ఐదుగురు, లాన్స్ నాయక్‌లు 15 మంది ఉంటారు. కంపెనీ హవాల్దార్‌గా విధులు నిర్వర్తించే వారు... మేజర్ కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవాల్దార్‌గా పదోన్నతి పొందుతారు.
సెల్యూట్‌లోనూ భేదాలు
సిపాయిలు చేసే సెల్యూట్‌లోనూ హోదాలు తెలిసిపోతాయి. సమానమైన స్థాయిలో ఉన్న వారికి కేవలం చేతులతోనే సెల్యూట్ చేస్తారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌లు, కెప్టెన్ స్థాయి అధికారులకు రైఫిల్‌తో సెల్యూట్ చేస్తారు. నాన్ కమిషన్డ్ ఆఫీసర్లకు సెల్యూట్ పొందే అవకాశం ఉండదు. మేజర్‌స్థాయి, ఆపై అధికారులకు మాత్రమే ఆయుధాలతో సెల్యూట్ చేస్తారు. కవాతు సమయంలో కమిషన్డ్ ఆఫీసర్లకు రైఫిల్‌తోనే సెల్యూట్ చెయ్యాలి. బ్రిగేడియర్ స్థాయి అధికారులకు జనరల్ సెల్యూట్, దేశ అధ్యక్షుడు, రాష్ట్ర గవర్నర్లకు జాతీయ పతాకంతో సెల్యూట్ చేస్తారు. ఈ సెల్యూట్‌ను మిలటరీ బ్యాండ్ సమక్షంలోనే చేస్తారు. ఒక్కో సెల్యూట్‌కు ఒక్కో రాగంతో మిలటరీ బ్యాండ్ వాయిస్తారు. ఈ విధంగా దేశ రక్షణ రంగంలో పనిచేసే సోల్జర్లకు, అధికారులకు వారి హోదాలకు తగ్గట్లుగా గౌరవం లభిస్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment