వెల్లువెత్తిన ప్రజామద్దతు
ముద్రగడ ఆమరణ దీక్షకు సంఘీభావం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
ఖాళీ కంచాలపై గరిటలతో కొడుతూ నిరసనలు పలు ప్రాంతాల్లో రిలే దీక్షలు
కాపు ఉద్యమ నేత ముద్రగడ
పద్మనాభం దంపతుల దీక్షకు జిల్లావ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. వారి దీక్షకు సంఘీభావంగా పలుచోట్ల నిరాహార దీక్షలు ప్రారంభించారు. మధ్యాహ్న సమయంలో పలువురు ఖాళీ కంచాలు, గరిటలతో రోడ్లపైకి వచ్చి వాటితో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు.
కాకినాడ : అమలాపురంలో దివంగత కాపు నేత నల్లా సూర్యచంద్రరావు, ఆయన సోదరుడునల్లా విష్ణుమూర్తిల తనయులు పవన్, అజయ్ ఆమరణ దీక్ష చేపట్టారు. గడియారం స్తంభం సెంటరులో కోనసీమ తెలగ, బలిజ, కాపు (టీబీకే) సంఘం అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యాన రిలే దీక్షలు ప్రారంభించారు. 19 మంది కాపు నాయకులు దీక్షల్లో కూర్చున్నారు. అల్లవరం పోలీసు స్టేషన్ సెంటర్‌లో రిలే దీక్షలకు ఆల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, మత్స్యకార నాయకులు మల్లాడి హనుమంతరావు, నాతి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఉప్పలగుప్తంలో జరుగుతున్న దీక్షలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, పార్టీ నాయకులు బద్రి బాబ్జీ, జున్నూరి వెంకటేశ్వరరావు, కడిమి చిన్నారావు సంఘీభావం తెలిపారు.
ముమ్మిడివరం నియోజకవర్గం గేదెల్లంక, ఐ.పోలవరం మండలం కొమరగిరి, మండల కేంద్రమైన తాళ్ళరేవు, కాట్రేనికోన మండలం చెయ్యేరులో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. అమలాపురం మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. పి.గన్నవరం మండలం బోడపాటివారిపాలెంలో 200 మంది మహిళలు, కంచాలను గరిటెలతో వాయిస్తూ ముద్రగడ దీక్షకు మద్దతు తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురంలో కాపు నాయకుడు ఆకుల రామకృష్ణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కొత్తపేట మండలం వాడపాలెంలో కాపు యువకులు రిలే దీక్షలు చేపట్టారు.మండపేట పట్టణ కాపు సంఘం ఆధ్వర్యాన రిలే దీక్షలు ప్రారంభించారు. సంఘ నాయకులు కామన ప్రభాకరరావు, సత్యవాణి దంపతులు, జున్నూరు సాయిబాబా, అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మెట్ట ప్రాంతంలో..
ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో రిలే దీక్షలు చేశారు. పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, తుని, తొండంగి, కోటనందూరు, రౌతులపూడి, రాజోలు, మల్కిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి తదితర మండలాల్లో ఆందోళనలు చేశారు. నగరాల్లో.. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్‌లో ఖాళీ కంచాలపై గరిటెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆకుల వీర్రాజు, కాపు సంఘ నాయకులు రామినీడు మురళి, నందెపు శ్రీనివాస్, శేషు నారాయణ, ఇసుకపల్లి శ్రీనివాస్, సుంకర శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు. కడియం దేవీచౌక్ సెంటర్‌లో మండల కాపు ఐక్యవేదిక ఆధ్వర్యాన ఆందోళన నిర్వహించారు. చీకట్ల రమణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ గిరిజాల వెంకట స్వామినాయుడు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్ సిద్ధార్థనగర్‌లో కాపు సద్భావన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వా ప్రభాకరరావు ఆధ్వర్యాన కంచాలు, గరిటెలతో శబ్దాలు చేస్తూ ఆందోళన చేశారు. కరప మండలం కరప, అరట్లకట్ట, పెనుగుదురు, చినకొత్తూరు, పెదకొత్తూరు, కూరాడ గ్రామాల్లో రిలే దీక్షలు చేపట్టి, మధ్యాహ్న భోజన సమయంలో కంచాలపై గరిటెలతో కొట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు కరప శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తే అభ్యంతరం లేదని అన్నారు. కాకినాడ మసీదు సెంటర్‌లో కాపులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ైవైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.