తుది దశకు ఏర్పాట్లు
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ఈ ఉత్సవానికి వేదికగా ఎంపిక చేసిన ఏఎన్‌యూ ఎదురుగానున్న స్థలంలో పనులు గడచిన వారం రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే.
సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో భారీ ఎత్తున పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంటే.. నాయకులు దీనిని ఆర్భాటంగా చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాంగణంలో బారికేడ్ల నిర్మాణం పూర్తికాగా తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేశారు. అలాగే సభ రాత్రి వేళ కావడంతో ప్రతి రెండు వందల అడుగుల దూరంలో ఒక్కోటి వంతున దాదాపు రెండువేల హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రానికి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు అందడంతో ఆ మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా వేదిక నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ప్రధాన వేదికను 480 అడుగులతో ఏర్పాటు చేస్తున్నారు. ఐరన్ బారికేడ్లతో వేదికను నిర్మించి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. 600 మంది మీడియా ప్రతినిధులకు, 5వేల మంది వీఐపీలకు పాస్‌లు కేటాయించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం వేదిక వెనుక భాగంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
ట్రయిల్ రన్ నిర్వహించిన అధికారులు ...
ఏర్పాట్లలో భాగంగా గురువారం పోలీస్ ఉన్నతాధికారులు మైదానంలో కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. టోల్‌గేట్ సమీపంలోని రహదారి వద్ద నుంచి సభా ప్రాంగణం వెనుక రహదారి గుండా 20 పోలీస్ వాహనాలతో ట్రయిల్ రన్ నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్, గుంటూరు రూరల్, అర్భన్ ఎస్పీలు జె.సత్యనారాయణ, గోపీనాథ్ జెట్టిలు దీనిని పర్యవేక్షించారు.
అధికారులు, నేతల పరిశీలన
ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఐఏఎస్ అధికారులు శ్యామ్‌బాబు, ఎం దానం కిశోర్‌బాబు, జిల్లా కలెక్టర్ ఎస్.సురేష్‌కుమార్, కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జేసీ వివేక్ యాదవ్, గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్, అర్భన్, రూరల్ ఎస్పీలు గోపినాథ్ జెట్టి, జె సత్యనారాయణ, డీఐజీ రామకృష్ణ, ఆర్డీవో రామ్మూర్తి పరిశీలించారు.
వేదిక నిర్మాణ పనులను మరింత వేగంగా చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, మద్దాలి గిరిధర్, జియావుద్దీన్, అబ్దుల్ అఖీమ్, గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు తదితరులు పరిశీలించిన వారిలో ఉన్నారు.