
కార్పొరేషన్ ఏర్పాటు హామీపై ఆర్య వైశ్య మహాసభ హర్షం
సాక్షి, హైదరాబాద్: తమ సంక్షేమం కోసం ఆర్య వైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించినందుకు నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీకి వైశ్యులంతా ఓట్లు వేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఆయన నేతృత్వంలో తరలివచ్చిన వైశ్య ప్రముఖులు మంగళవారమిక్కడ జగన్‌ను కలుసుకున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ , పలువురు వైశ్య ప్రముఖులు జగన్‌ను కలసి వారిలో ఉన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి నంద్యాలలో ఏ ఒక్కరికీ హాని చేయలేదని, ఎవరి దగ్గర నుంచీ ఒక్క సెంటు భూమి కూడా లాక్కోలేదని నంద్యాల వైశ్య ప్రముఖుడు ఎన్. సత్యనారాయణ అన్నారు.