ఉల్లి పేలుళ్లు
Published Fri, Nov 1 2013 2:11 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు:మూడు నెలల నాడు జిల్లాకు రోజుకు 150 టన్నుల వరకు మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు, నాసిక్, షోలాపూర్‌ల నుంచి దిగుమతు లుండే ఉల్లి ఇప్పుడు కేవలం 80 టన్నుల వరకు దిగుమతి అవుతున్నట్లు అధికారుల లెక్క. అమ్మకాలు మాత్రం తీసికట్టుగా ఉండటం పరిశీలనాంశం. రైతుబజార్లలో సుమారు 25 క్వింటాళ్లు,బహిరంగ మార్కెట్లో 50 క్వింటాళ్ల వరకు అమ్ముడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలినదంతా రిటైల్ వ్యాపారులు గోడౌన్లలో అక్రమ నిల్వలు చేస్తూ కొరత సృష్టించేందుకు యత్నిస్తున్నారు. తద్వారా అక్రమంగా రేట్లు పెంచే యోచనలో ఉన్నారు. రిటైల్ వ్యాపారుల అక్రమ దందాతో జిల్లాలోని వినియోగదారులు ఉల్లిని కొనలేని స్థితికి చేరుకుంటున్నారు.
రిటైల్ వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ ఎలాగంటే..
ఉల్లి సాగయ్యే కర్నూలు, మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాల కారణంగా పంట తుడిచి పెట్టుకుపోయింది. అటు మహారాష్ట్ర, కర్ణాటకలలో ధర బాగా పలుకుతుండటంతో దిగుమతులు ఆశాజనకంగా లేవు. షోలాపూర్‌లో కొత్త పంట ఇంకా చేతికి రాలేదు. ఇటు జిల్లాలో ఉల్లి పంట సాగు చేసే పెనుమాక, అమరావతి, సౌపాడు, తుళ్లూరు, మోతడకలో సాధారణంగా డిసెంబర్‌లో పంట మార్కెట్‌కు వస్తుంది. ఇటీవల వరదలతో జిల్లాలోని ఈ ప్రాంతాల్లో పంట మొత్తం దెబ్బతింది. దీంతో రిటైల్ వ్యాపారుల్లో బ్లాక్ మార్కెటింగ్ ఆలోచనలు రేకెత్తి అరకొరగా దిగుమతి అయిన ఉల్లిని గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచేస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిన ఉల్లిని బ్లాక్ మార్కెట్‌కు తరలించేస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి మాత్రమే ఎక్కువ కాలం నిల్వ చేసే వీలుంది. కర్నూలు, కడప ప్రాంతాల నుంచి వచ్చే ఉల్లికి త్వరగా పాడయ్యే గుణం ఉండటంతో ఈ సరుకు జోలికెవ్వరూ వెళ్లడం లేదు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నగరానికి రోజుకు 8-10 లారీల సరుకు దిగుమతి అయ్యేది. ఇప్పుడు కేవలం 3 లారీల సరకు వస్తోంది. దీన్ని నగరంలోని రిటైల్ వ్యాపారులు గోడౌన్లకు తరలించి అక్రమ దందా నడుపుతున్నారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంతో వీరి దందా సాగుతోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఉల్లి ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
రైతుబజార్లలో అంతంతమాత్రమే
జిల్లాలోని ఏడు రైతు బజార్లలో అందుబాటులో ఉల్లి ధరలు ఉండేలా అమ్మకాలు చేపడతామని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నా, ఇక్కడ అమ్మకాలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. గుంటూరులో రెండు రైతుబజార్లు, తెనాలి-2, చిలకలూరిపేట-1, నరసరావుపేట-1, మంగళగిరి-1 రైతు బజార్లలో రోజుకు సుమారు 25 క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేపడతున్నట్లు అధికారులు పేర్కొంటున్నా, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగానే ఉంది. రైతు బజార్లలో రెండు రకాల సైజు ఉల్లి అమ్మకాలు సాగుతున్నాయి. కర్నూలు మీడియం సైజు ఉల్లి ధర రూ. 38, షోలాపూర్ రూ.48 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం మీడియం సైజు ధర రూ.60 వరకు ఉంటే, షోలాపూర్ ధర రూ.80 వరకు పలుకుతుంది. జూలై వరకు రూ.20 ఉంటే ఇప్పుడు మాత్రం నాలుగింతలు పెరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగి ఉల్లి ధరలు అదుపు చేయకుంటే, దీపావళి పండగకు అమాంతం పెంచే యోచనలో వ్యాపారులున్నట్లు సమాచారం.
రైతుబజార్లలో కౌంటర్లు
= షోలాపూర్ రకం రూ.48= కర్నూల్ రకం రూ.38
సాక్షి, గుంటూరు: ఉల్లిపాయల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన జిల్లాలోని ఉల్లిపాయల హోల్‌సేల్ అసోసియేషన్ వర్తకులతో మాట్లాడి అన్ని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకాలు చేసేలా ఒప్పందం చేయించారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, నరసరావుపేట పట్టణాల్లోని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లలో షోలాపూర్‌కు చెందిన ఉల్లిపాయలను కిలో రూ.48 చొప్పున కర్నూల్‌కు రెండో రకం ఉల్లిపాయల్ని కిలో రూ.38 చొప్పున విక్రయించనున్నారు. గుంటూరులో పట్టాభిపురం, బస్టాండ్ సెంటర్లలోని రైతుబజార్లు, తెనాలిలో చెంచుపేట, రత్నబజార్, నరసరావుపేటలోని అరుణోదయ షోరూమ్ రైతుబజార్, మంగళగిరి మార్కెట్‌యార్డుతో పాటు చిలకలూరిపేట రైతు బజార్‌లో ఉల్లిపాయల ప్రత్యేక కౌంటర్‌లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ కోరారు.
Advertisement
Advertisement