రాజుగోరు మారిపోన్రు...!!
* బస్సులు తుడిసేండు...
* జనాన్ని కలిసేండు..అశోక్ వైఖరిలోపెను మార్పులు
* విస్తుపోతున్న జనం
* ఓటమి భయమేనంటున్న విశ్లేషకులు
విజయనగరం: ఒరే బావా...బళ్లు ఓడలవడం... ఓడలు బళ్లవడం అంటే ఇదేన్రా... రోజులెప్పుడూ ఒకేలాగ ఉండవెస్... మారిపోతుంతాయిరా... నేకపోతే రాజుగోరేటి బస్సులు తుడ్డమేటి? మారాజుగారేటి జనాన్ని కలడమేటి... జనమే ఆయన్ను కలవాలగానీ ఆయన పెజల దగ్గరకు ఎల్లడమేట్రా...ఇదంతా ఇడ్డూరం కాకపోతే.. అంటూ గంట స్థంభానికి జేరపడి పైడిరాజు మందు తాగుతూ తెగ ఇదైపోతన్నాడు... ఇదంతా చూస్తున్న సింహాచలం ఆందోళనతో దగ్గరికొచ్చి ‘పైడి బావా ఏట్రా నీబాద, ఏటైందేటి... ఓ...తెగ పీలైపోతన్నావు.. అంటు భుజం పట్టి కుదిపాడు. దీనికి పైడిరాజు ‘ఏటి సెప్పమంతావ్‌రా.. అరవయ్యేళ్లుగా మనిద్దరం ఇదే ఇజానారంలో ఉంతన్నాము నీకు తెలుసుగదా.. ఏనాడైనా రాజుగోరు ఈదిలోకి రావడం సూసినామేటి... అంతెందుకు ఆ మారాజు జనాన్ని కలవడం జరిగిందేటి? మరి ఇన్నాళ్లూ లేంది ఇప్పుడేట్రా నాయినా ఆయన ఇంతోటు చేసెత్తన్నారు.
ఇదంతా సూత్తుంటే నాకు బయమేసెత్తంది.. ఏదో ఐపోద్దేటో అని పించెత్తంది అంటూ జనం వైపు ఎర్రి సూపులు సూత్తన్నాడు. ఒరే నీళ్లు కలపకుండా డెరైట్రుగా తాగిత్తే బయమెయ్యదేటి ...అందుకే ఎప్పుడూ సెప్తుంటాను నీళ్లు కలుపుకోరా...అని అంటూ వాటర్ పేకెట్ కొరికి పుస్సున పైడిరాజు ప్లాస్టిక్ గ్లాసులో పోశాడు. ఛస్... నీయబ్బా... స్వచ్ఛమైన మందును కల్తీ సేశ్శావ్‌రా.. అని టంగున సింహాచలం బుర్రమీద మొట్టికాయ వేశాడు.
దీనికి సింహాచలం దీనంగా చూసి బుర్ర తడుముకుంటూ...మరేట్రా పైడిగా... ఎర్రిపేలాపన కాకపోతే...ఏటీ సెప్పకుండా ఏదో పెల్తే నాకేటి అర్థమవుతాది. అంటూ సింహాచలం గొణిగా డు. చివరి గుటక టక్కున మింగేసి పైడిరాజు ఆకాశం వంక అదోలా చూస్తూ ఇజానారం మా రాజుగారైన అశోక్ గజపతి రాజుగోరు మొన్న కాంప్లెక్సులో బస్సెక్కి ఎగిరెగిరి మరీ అద్దాలు తుడుత్తుంటే.. నాకు ఏడుపొచ్చీసింది.
దానికి ముందు పదేనురోజుల కిందట అంతటి పెద్దమనిసీ ఎండలో రోడ్ల మీద నిలబడి వచ్చిపోయే బళ్లకు సమైక్యాంధ్ర స్టిక్కర్లు అంటించీనాడు... రోడ్ల మీద కార్యకర్తలను కూకోబెట్టి సహపంతి బోయనాలు పెట్టీనాడు... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచీడానికి ఎన్ని సెయ్యాలో అన్నీ సేత్తన్నా డు... నిజంగా ఆయన మనిసి కాదురా ...దేవుడు.. నిజంగా దేవుడేనెస్...మారాజుకు ఇన్ని కష్టాలు వత్తాయని నేను కల్లో కూడా అనుకోలేదురా..కల్లో కూడా అనుకోలేదు అంటూ ముక్కు చీది సిమాచలం చొక్కాకి తుడిసీనాడు.
ఈ దెబ్బతో సిమాచలానికి తిక్క రేగిపోయింది.... ఓరి తాగుబోతు బావా... నువ్వు తాగింది గోరంత...ఎక్కింది చెంబంత... నీకు మెంటలూ గట్రా వచ్చీసిందేట్రా...అంటూ గసిరీనాడు...అంతలోనే మళ్లీ అందుకుని రాజుగో రు మన కోసం గట్రా త్యాగాలు సేసీనేదురా.. చంద్రబాబు ఎలాగూ ఇబజనకు ఓకే సెప్పీనాడు.. ఆయన అతితెలివి దెబ్బకు సీమాంద్ర లో తెలుగుదేశం సీట్లు సిరిగిపోనాయి. అవన్నీ కప్పుకోడానికి ఈ నాయకులు ఇలా నాటకాలు ఆడతన్నార్రా..
మరీ ఈ మారాజుకు నిజంగా అంత బాదుంతే డెరైట్రుగా ఈ ఇషయం శంద్రబాబుకే సెప్పొచ్చుగదా... ఐదరాబాదులో పల్లక కూకుని ఇక్కడ ఈ డ్రామాలు ఏటి.... వచ్చీ ఎన్నికల్లో తన పరువు కాపాడుకోడానికి ఈయన ఇలా ఏడో ఆట ఆడుతున్నాడు గానీ ఇవన్నీ నిజగం కాదురా ఎర్రిపైడిరాజూ... అంటూ గానోదయం కలిగించాడు. ఈ దెబ్బతో పైడిరాజుకు ఇంతాక తాగిందంతా దిగిపోయి ఒరేయ్ బావా... నీకు ఇన్ని తెలివిటేట్లున్నాయనుకోలేదు.. నీది బుర్రకాదురా... మన ఇజానా రం పెద్ద సెరువే...అంటూ వాటేస్కున్నాడు...