కావలిలో బాలుడి కిడ్నాప్
► రూ.10లక్షలు డిమాండ్ చేసిన దుండగుడు
► ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి చొరవతో కిడ్నాపర్ ఆటకట్టు
► పోలీసుల అదుపులో జులాయి
కావలి: పట్టణానికి చెందిన 4వ తరగతి చదువుతున్న బాలుడి కిడ్నాప్ ఉదంతం గురువారం సాయంత్రం ప్రజలను కలవరపెట్టింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని జనతాపేటకు చెందిన బుర్లా శ్రీధర్‌రెడ్డి కుమారుడు జయవర్ధన్‌రెడ్డి స్థానికంగా ఉన్న శ్రీచైతన్య పాఠశాలలో 4వతరగతి చదువుతున్నాడు. ముసునూరుకు చెందిన కుందుర్తి చౌసిల్ ఉదయం పాఠశాలకు వెళ్లి ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి వారి తల్లిదండ్రులు జయవర్ధన్‌రెడ్డిని తీసుకురమ్మన్నారని స్కూలు ఉపాధ్యాయులకు చెప్పాడు.
నిందితుడి మాటలు విన్న టీచర్లు బాలుడిని అతనికి అప్పగించారు. ఆటోలో ఎక్కించుకున్న బాలుడిని పట్టణమంతా తిప్పుతూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చౌసిల్ రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు నేరుగా స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ విశాల్ గున్నీతో మాట్లాడారు.
దీంతో కావలి పోలీసులను అప్రమత్తం చేసి బాలుడిని కాపాడగలిగారు. పోలీసుల హడా వుడితో కిడ్నాపర్ పట్టణంలోనే వెంగళరావునగర్ ప్రాంతంలో బాలుడిని వదిలి వెళ్లాడు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు ఇంటికి చేరుకుని జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వైస్సార్‌సీపీ స్థానిక నేతలతో చర్చించి న తరువాత బాలుడిని వెంటబెట్టుకుని ముసునూరుకు తీసుకెళ్లారు. ముసునూరులో కిడ్నాపర్ ఇంటికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గరే ఉన్న కిడ్నాపర్ చౌసిల్‌ను బాలుడు గుర్తుపట్టాడు. వెంటనే నిందితుడిని పట్టుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు.
కిడ్నాప్‌నకు పాల్పడిన కుందుర్తి చౌసిల్ బీటెక్ మధ్యలోనే వదిలి జులాయిగా తిరుగుతుంటాడని పోలీసులు తెలిపారు. అతను పట్టణంలో ఓ షాపులో పనిచేస్తున్నప్పుడు శ్రీధర్‌రెడ్డి పక్కనే ఉన్న తన స్నేహితుడి షాపు వద్దకు వెళ్తుండేవాడు. శ్రీధర్‌రెడ్డి ఆస్తిపాస్తులపై ఆరా తీసిన చౌసిల్ డబ్బులు రాబట్టేందుకు ఆయన కుమారుడిపై కన్నేసి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. చౌసిల్‌ని అరె స్ట్ చేసి విచారిస్తున్నారు.