- రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఎంపీటీసీలకు మండల పరిషత్ కార్యాలయాల్లో
- జెడ్పీటీసీలకు జిల్లా పరిషత్‌లో..
- అభ్యర్థుల వేటలో పార్టీలు బిజీ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. సుప్రీంకోర్టు కు ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఎంటీపీసీ, జడ్పీటీసీ సభ్యులకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి సోమవారం తెర లేవనుంది. దీంతో అభ్యర్థుల కోసం ఆయా రాజకీయ పార్టీలు వేట సా గిస్తున్నాయి.
కొన్ని స్థానాలు షెడ్యూల్డ్ ప్రాం తాల్లో బీసీలకు, మైదాన ప్రాంతాల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు రావడంతో అభ్యర్థులు దొరక్క పార్టీలు మల్లగుల్లా లు పడుతున్నాయి. రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థు ల కోసం నాయకులందరూ గ్రామాల్లో గాలిస్తున్నా రు. రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు డిమాండ్ విపరీ తం గా ఉంది. వారికి పార్టీలు తాయిళాల ఎర వేసి త మవైపు తిప్పుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
ఏర్పాట్లలో అధికారులు
జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 16,50,197 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 8,08,672 మంది పురుషులు, 8,41,525 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
17 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 20వ తేదీ వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు ఎంపీటీసీ అభ్యర్థులు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోనూ, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలోనూ నామినేషన్లు అందజేయాలి.
పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్‌తో పాటు ‘బీ’ ఫారమ్ తప్పనిసరిగా జతచేయాలి.
ఎంపీటీసీ అభ్యర్థులు మండలంలో ఏదో చోట ఓటు హక్కు కలిగి ఉండాలి. అభ్యర్థిని బలపరిచే వ్యక్తి మాత్రం కచ్చితంగా అదే సెగ్మెంట్లో ఓటు హక్కు కలిగి ఉండాలి. జెడ్పీటీసీ అభ్యర్థి జిల్లాలో ఓటు ఉండి బలపరిచే వారికి ఆ మండలంలో ఓటుండాలి.
జెడ్పీటీసీ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2500, ఇతరులు రూ.5 వేలు ధరావతు కింద చెల్లించాలి.
ఎంపీటీసీ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1250, ఇతరులు రూ.2,500 చెల్లించాలి.
ఈ నెల 21న నామినేషన్లు పరిశీలన, 22న నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు, 23న వాటి పరిష్కారం ఉంటుంది.
ఈ నెల 24లోపు ఉపసంహరణకు గడువుంది. అదే రోజున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ ఉంటుంది.