రెండు విడతల పోరు? | Two phases poll for MPTC, ZPTC elections? | Sakshi
Sakshi News home page

రెండు విడతల పోరు?

Published Fri, Mar 14 2014 1:09 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

రెండు విడతల పోరు? - Sakshi

రెండు విడతల పోరు?

  •  ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు దఫాలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
  •   అఖిలపక్ష భేటీ అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం యోచన
  •   నోటిఫికేషన్‌లో మార్పులతో నేడు సుప్రీంకోర్టుకు అఫిడవిట్!
  •   వాయిదాపై అఖిలపక్షంలో ఏకాభిప్రాయం రాలేదు..  కొన్ని పార్టీలు వాయిదా కోరితే, మరికొన్ని వద్దన్నాయి: సంఘం వర్గాలు
  •   ఎన్నికలు నిర్వహించి, ఫలితాలు ఆపటం సాధ్యం కాదని వెల్లడి 
  •   పోలీసు బలగాల ఇబ్బంది వల్లనే రెండు విడతల యోచన
  •   అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఢిల్లీ వెళ్లనున్న నవీన్ మిట్టల్!
  •   8న శ్రీరామనవమి.. రెండో విడత తేదీ మారే అవకాశం?
  •  
     సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఎన్నికల వాయిదా అంశంపై అఖిలపక్ష భేటీలో రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని భావిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేయటం కన్నా.. రెండు విడతలుగా నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6వ తేదీన ఒక విడత, ఏప్రిల్ 8వ తేదీన రెండో విడత ఎన్నికలు నిర్వహించాలని.. ఏప్రిల్ 11వ తేదీన ఫలితాలు ప్రకటించాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహిస్తే భద్రతా బలగాల మోహరింపు కష్టమవుతుందని రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిస్సహాయత వ్యక్తం చేయటంతో ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అయితే.. 8వ తేదీ శ్రీరామనవమి పర్వదినం ఉండటంతో రెండో విడత ఎన్నికకు అదే రోజును ఖరారు చేస్తారా? ఆ తేదీని మారుస్తారా? అన్న చర్చ జరుగుతోంది.  
     
    పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసి, ఆదేశాలు ఇవ్వటంతో.. ఏప్రిల్ ఆరో తేదీన ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఎన్నికల సంఘం ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఈ ఎన్నికలపైకేసును విచారిస్తున్న సుప్రీంకోర్టుకు కూడా నివేదించిన విషయమూ విదితమే. గురువారం నాడు కేసు విచారణ సందర్భంగా.. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల షెడ్యూలు విడుదల చేశామని, అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించటం ఇబ్బందికరంగా ఉందని, పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ఈ ఎన్నికలను వాయిదా వేస్తే బాగుంటుందని నివేదించిన విషయమూ తెలిసిందే.
     
    దీనికి సంబంధించి సరైన కారణాలు వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనిపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. ఈ భేటీలో పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేదని, కొన్ని పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కోరగా, మరికొన్ని ఎన్నికలు వాయిదా వేయాలని, ఇంకొన్ని పార్టీలు ఫలితాలు వేయిదా వేయాలని విజ్ఞప్తి చేశాయని ఎన్నికల సంఘం అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. 
     
     ఎన్నికలు, ఫలితాల వాయిదా సాధ్యం కాదు...
     అలాగే.. సాధారణ, ఎన్నికల తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నా కష్టసాధ్యమని, కేంద్ర బలగాలు వెళ్లిపోతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. పైగా రాష్ట్ర విభజన ప్రక్రియ ముగింపు దశలో ఉంటుందని, ఆ సమయంలో ఎన్నికల నిర్వహణ కష్టమేనని సంఘం వర్గాలు చెప్తున్నాయి. అలాగే.. ఎన్నికలు నిర్వహించి కేవలం ఫలితాలు వాయిదా వేయాలన్నా సాధ్యం కాదని స్పష్టంచేస్తున్నాయి. మొత్తం 1.40 లక్షల బ్యాలెట్ బాక్సులకు భద్రత కల్పించాలంటే 15 బెటాలియన్‌ల భద్రతా సిబ్బంది కావాల్సి ఉంటుందని అంచనా. సాధారణ ఎన్నికలు నిర్వహించే సమయంలో సాయుధ బలగాలను కేవలం బ్యాలెట్ బాక్స్‌ల భద్రతకు వినియోగించడం సాధ్యమయ్యే పనికాదని ఎన్నికల సంఘం వర్గాలు అభిప్రాయపడ్డాయి. 
     
     నోటిఫికేషన్‌లో మార్పులతో నేడు అఫిడవిట్...
     ఈ నేపధ్యంలో.. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను స్వల్ప మార్పులతో రెండు విడతలుగా ఇప్పుడే నిర్వహించాలని ఎన్నికల సంఘం అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌లో చేసే మార్పులను కూడా సుప్రీంకోర్టుకు వివరించాల్సి ఉన్నందున శుక్రవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసే అఫిడవిట్‌లో ఈ అంశాన్ని చేర్చనున్నట్లు సమాచారం. అఖిలపక్ష భేటీలో వ్యక్తమైన రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పొందుపరిచి, అఫిడవిట్ దాఖలు చేయటానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ స్వయంగా ఢిల్లీ వెళ్తున్నారు.
     
    అయితే.. శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసినా.. అదే రోజు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందన్న నమ్మకం లేదని, శనివారం నుంచి ఈ నెల 23వ  తేదీ వరకు సుప్రీంకోర్టుకు హోలీ సెలవుల కారణంగా జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వాయిదాపై నిర్ణయం వెలువడే అవకాశం లేదని అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వస్తే తప్ప ఎన్నికల ప్రక్రియ ఆగబోదని, ఈ నెల 17 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టంచేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement