మృతురాలి కుమారుడితో ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద వేచి ఉన్న బాధిత కుటుంబ సభ్యులు
కృష్ణాజిల్లా, జి. కొండూరు (మైలవరం) : కోడలు మృతి చెందడంతో మనవడి పేరుమీద కొంత ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిన పెనమలూరు ఏఎంసీ చైర్మన్ రవీంద్రప్రసాద్ రిజిష్ట్రార్ ఆఫీస్‌కు సమయానికి రాకపోగా బాధిత కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడికి యత్నించడంతో ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద వివాదం తలెత్తింది. వివరాలలోకి వెళ్తే. .. చెవుటూరుకు చెందిన సుమలత (20) కు కంకిపాడు మండలం జగన్నాధపురానికి చెందిన పెనమలూరు ఏఎంసీ చైర్మన్ సుద్దిమళ్ల రవీంద్రప్రసాద్ కుమారుడు విజయ్‌కుమార్‌తో వివాహమైంది. అత్తమామలతో వివాదం తలెత్తడంతో సుమలత భర్తతో కలిసి చెవుటూరుకు నివాసం మారారు.
అయితే, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుమలత ఆదివారం రాత్రి మృతి చెందింది. సుమలతకు 8 నెలల కుమారుడు ఉన్నాడు. బాలుడి సంరక్షణ కోసం కొంత ఆస్తిని రాసి ఇవ్వాలంటూ సుమలత కుటుంబ సభ్యులు రవీంద్రప్రసాద్‌ని కోరారు. దీనిపై వివాదం తలెత్తడంతో రవీంద్రప్రసాద్‌ని స్థానిక చర్చిలో సోమవారం బంధించారు. రవీంద్రప్రసాద్ ఏఎంసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు టీడీపీ నేత కావడంతో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సోమవారం అర్ధరాత్రి జి. కొండూరు పోలీసు స్టేషన్‌కు చేరుకొని డీఎస్పీ ప్రసాదరావుతో కలిసి మృతురాలి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత తనదంటూ మైలవరం ఏఎంసీ చైర్మన్ ఉయ్యూరు వెంకటనర్శింహారావు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రవీంద్రప్రసాద్‌ను విడుదల చేశారు. అయితే ఆస్తిని రిజిష్టర్ చేసేందుకు మంగళవారం ఉదయం వస్తానని చెప్పిన రవీంద్రప్రసాద్ రాత్రి 7 గంటల వరకు కూడా రాలేదు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు 8 నెలల బాలుడితో కలిసి 10 గంటలపాటు వేచి ఉన్నారు. స్థానిక నాయకుల ఒత్తిడితో రాత్రి 7 గంటలకు వచ్చిన రవీంద్రప్రసాద్ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశాడు. అనంతరం తన వెంట వచ్చిన అనుచరులతో బాధిత కుటుంబ సభ్యులపై దాడికి యత్నించడంతో వివాదం తలెత్తింది. చెవుటూరుకు చెందిన ఓ యువకుడిపై రవీంద్రప్రసాద్ అనుచరులు తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. పోలీసుల జోక్యంతో ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment