ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
ముగ్గళ్ల (సీతానగరం) :భూపాలపట్నం ఎస్‌బీఐ బ్రాంచిలో దుండగులు చోరీకి యత్నించిన సంఘటనను మరువకముందే.. ఎస్‌బీఐ ముగ్గళ్ల బ్రాంచికి చెందిన ఏటీఎంలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బ్యాంకు వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు ఏటీఎంలోకి చొరబడ్డారు. కోటు వేసుకున్న దుండగులు ముఖం కనిపించకుండా ముసుగును ధరించారు. ముసుగులోంచి చూసేందుకు వీలుగా రంధ్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏటీఎంలో ఉన్న రెండు సీసీ కెమేరాల్లో ఒకదానిని తస్కరించారు. ఏటీఎం నుంచి నగదు వచ్చే చోట ప్లాస్టిక్ భాగాన్ని విరగొట్టారు.
నగదు దొంగిలించడానికి కుదరకపోవడంతో.. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో బ్యాంక్ మేనేజర్ సత్యకిషోర్ అక్కడకు చేరుకున్నారు. ఏటీఎం తలుపు బార్లా తెరిచి ఉండడంతో.. లోనికి వెళ్లి పరిశీలించారు. ఏటీఎం పాక్షికంగా ధ్వంసమై ఉండడంతో దొంగలు చోరీకి యత్నించినట్టు గుర్తించారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై పవన్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమేరా ఫుటేజిని పరిశీలించగా, దుండగులు ప్రవేశించిన తీరు, చోరీకి యత్నించిన సంఘటనలు నమోదయ్యాయి. ఏటీఎంలో చొరబడిన ఇద్దరితో పాటు మరికొంత మంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.