విడవలూరు / బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: దమ్ముంటే ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప పిరికిపంద చర్యలకు పాల్పడటం తగదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హితవు పలికారు. విడవలూరు మండలం ముదివర్తిలో వైఎస్సార్ సీపీ నేత కొండూరు వెంకటసుబ్బారెడ్డి హత్యకు కుట్ర జరిగిన నేపథ్యంలో ప్రసన్న ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. శుక్రవారం ఉదయం విషయం తెలిసిన వెంటనే ఆయన ముదివర్తికి చేరుకున్నారు. వెంకటసుబ్బారెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.
ఇలాంటి చర్యలకు పాల్పడటం నీచమైన వారి పనేనన్నారు. ఏ పార్టీ వారైనా దమ్ముంటే నేరుగా తమను రాజకీయాల్లో ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అధికార పార్టీకి తలొగ్గకుండా నిజాయితీగా వ్యవహరించాలని ఎస్పీ, డీఎస్పీ, సీఐలను ఆయన కోరారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్లు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఓగు నాగేశ్వరరావు, నాయకులు కలువ బాలశంకర్‌రెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, సింహాద్రి అయ్యప్ప, దేవరపల్లి శ్రీనివాసులరెడ్డి, సురేంద్రరెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు, వివేక్‌రెడ్డి, మాతూరు శ్రీనివాసులరెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కలకలం
వైఎస్సార్‌సీపీ నేత కొండూరు వెంకటసుబ్బారెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగిందనే విషయం విడవలూరు ప్రాంతంలో కలకలం రేపింది. ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో చురుగ్గా స్పందించే నేతగా వెంకటసుబ్బారెడ్డికి పేరుంది. అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ ఆయన ముందుకొస్తారు. వెంకటసుబ్బారెడ్డి భార్య సునీతమ్మ ఇటీవల ముదివర్తి సర్పంచ్‌గా విజయం సాధించగా కుమారుడు లక్ష్మీనారాయణరెడ్డి ముదివర్తి సొసైటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ వరుస విజయాలతో దూసుకుపోవడాన్ని ఓర్వలేని వారు ఆయన హత్యకు కుట్రపన్ని ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న కోవూరు సీఐ మాణిక్యరావు, విడవలూరు ఎస్‌ఐ అమీర్‌జాన్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుల ఆధారాల సేకరణకు డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింగారు. గ్రామంలోని మూడు ఇళ్ల వద్ద జాగిలం అనుమానాస్పదంగా ఆగగా, ఆ ఇళ్లలోని వారు అప్పటికే గ్రామం విడిచివెళ్లడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి
Published Sat, Nov 23 2013 5:00 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM
Advertisement
Advertisement