
రఘురాజు
విజయనగరం , శృంగవరపుకోట : నియోజకవర్గ స్థాయి నేతగా, మాజీ మంత్రి బొత్స అనుచరునిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జిల్లా వాసులకు సుపరిచితుడైన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు హత్యకు ఇద్దరు వ్యక్తులు కుట్ర పన్నినట్టు వస్తున్న వార్తలు స్థానికంగా సంచలనం రేపుతున్నాయి. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాలిలా ఉన్నాయి. నెల రోజులుగా ఇద్దరు వ్యక్తులు తరచూ వైఎస్సార్‌సీపీ నేత రఘురాజుకు, అతని భార్య సుధారాజులకు ఫోన్‌లు చేసి ‘రఘురాజును చంపేస్తాం.. ఆయన్ని చంపితే మాకు రూ.3 కోట్లు ఇస్తామన్నారు.. మీరుంటే వాళ్లు ఎన్నికల్లో గెలవలేరట.. మా ఖర్చులు మాకుంటాయిగా.. మిమ్మల్ని వేసేయడం ఖాయం.. అం టూ ఫోన్‌చేసి బెదిరిస్తున్నారు. అయితే మొదట్లో ఆకతాయిల పనిగా తేలిగ్గా తీసుకున్న రఘురాజు అదే పనిగా ఫోన్‌కాల్స్ రావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, రఘురాజులు డీఐజీ పాలరాజును శనివారం కలిసి బెదిరింపుల విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు రఘురాజు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఎస్.కోట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే సీతంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని, కృష్ణాపురానికి చెందిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెండు రోజులుగా విచారిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు నోరు విప్పితే వాస్తవాలు వెలుగుచూస్తాయి.
గతంలోనూ బెదిరింపులు ..
ఎస్.కోట మండలంలో జింధాల్ భూముల కేటాయింపు సమయంలో (2007లో) రఘురాజుకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. అప్పట్లో విచారణ చేపట్టిన పోలీసులు రఘురాజుకు ప్రాణాలకు ముప్పు ఉందని నిర్దారించి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల పాటూ ఉదయం నలుగురు, రాత్రి ముగ్గురు కానిస్టేబుళ్లు రఘురాజు ఇంటి వద్ద బందోబస్తుగా ఉండేవారు. అలాగే ఆయనకు ఇద్దరు గన్‌మన్‌లను కేటాయించారు. ఇదిలా ఉంటే బొడ్డవరలో ఉన్న ఇంటిలో ఉండవద్దని పోలీసులు సూచించడంతో కొంతకాలం నుంచి రఘురాజు కుటుంబం విశాఖలో ఉంటోంది. అదే సమయంలో రఘురాజుకు పోలీస్‌శాఖ ఆయుధ లైసెన్స్ కూడా జారీ చేసింది. ఈ తరుణంలో మరోమారు రఘురాజుకు ప్రాణహాని ఉందన్న వార్తలు హల్‌చల్ చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment