- అకడమిక్ సెనేట్ సమావేశంలో నిర్ణయం
- రూ.367 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా పలు కోర్సులు ప్రారంభించాలని గురువారం జరిగిన అకడమిక్ సెనేట్ సమావేశంలో నిర్ణయించారు. తొలుత వీసీ గత మూడు నెలలుగా వర్సిటీలో జరిగిన ప్రగతి కార్యక్రమాలను వివరించారు. అనంతరం 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.118 కోట్ల లోటుతో రూ.367 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సెనేట్ ముందుంచి ఆమోదం పొందారు.
పాట్నా వర్సిటీ ఉపకులపతిగా నియమితులైన ఏయూ మాజీ వీసీ వై.సి సింహాద్రిని ఈ సందర్భంగా వీసీ రాజు సత్కరించారు. అకడమిక్ సెనేట్ శాశ్వత సభ్యుడు అక్కినేని నాగేశ్వరరావు మృతికి సభ్యులు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వర్సిటీ మాజీ వీసీ కె.వి.రమణ, రెక్టార్ ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, ఫ్యాకల్టీ చైర్మన్లు, సెనేట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సెనేట్ సమావేశం వివరాలను వీసీ విలేకరులకు వివరించారు.
ఇవీ కొత్త కోర్సులు
జర్నలిజం విభాగం ద్వారా రెండేళ్ల కాల వ్యవధితో ఎంఎస్ కమ్యూనికేషన్ మీడియా స్టడీస్(సెల్ఫ్ ఫైనాన్స్), కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల నుంచి ఐదేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులు, ఎం.ఫార్మసీ నుంచి ఫార్మస్యూటికల్ మేనేజ్‌మెంట్, రెగ్యులారిటీ ఎఫైర్స్, చిత్రకళా విభాగం నుంచి ఎంఎఫ్‌ఏ, పీహెచ్‌డీ, మహిళా అధ్యయన కేంద్రం ద్వారా మూడు నెలల కాల వ్యవధి కలిగిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ సర్వైవల్ స్కిల్స్ కోర్సులు ప్రారంభించనున్నారు.
గతంలో నిలిపివేసిన ఎంఎస్ జియాలజీ కోర్సును పునః ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి మెరైన్ జియాలజీ, ఇంజినీరింగ్ కళాశాల ద్వారా అందిస్తున్న ఐదేళ్ల సమీకృత అనువర్తిత రసాయన శాస్త్రం కోర్సుల్లో ప్రవేశాలను నిలిపివేశారు.
వర్సిటీ ఐఏఎస్‌ఈ, విజయనగరం పీజీ కేంద్రం ద్వారా అందిస్తున్న ఎంఈడీ కోర్సుకు ఎన్‌సీటీఈ గుర్తింపు లభించిందని వీసీ తెలిపారు. వీటితో పాటు పలు కోర్సులలో సిలబస్ మార్పులు, పరీక్షల విధానం, మూల్యాంకనం తదితర అంశాలను సభ్యులు ఆమోదం తెలిపారు. యోగా విభాగం ద్వారా అందిస్తున్న ఎంఏ యోగా కోర్సు సిలబస్ మార్పులకు ఆమోదించారు.