తిండే లేదు... విమానాశ్రయమేల?
విషమిచ్చి భూములు తీసుకోండి
కుప్పంలో తేల్చిచెబుతున్న రైతులు
సర్వేకు సహకరించమని కోరిన అధికారులు
సర్వే బృందాలను అడ్డుకున్న వైనం
‘హెరిటేజ్’ ఎగుమతుల కోసమేనా అంటూ విమర్శ
‘‘కరువు కారణంగా తిండిలేక చస్తున్నాం.. తిండి పెట్టకుండా విమానాశ్రయం కడితే మాకేంటి ఉపయోగం.. మా భూము లు కావాలంటే తలా ఓ బాటిల్ విషమివ్వండి.. భూసేకరణకు అడ్డుపడే వారుండరు.. పరిహారం ఇవ్వాల్సిన పనిలేదు.. మా ప్రాణాలున్నంత వరకు భూములు ఇవ్వం’’ అంటున్నారు కుప్పం ప్రాంత రైతులు
తిరుపతి : రాష్ట్రంలో విలువైన భూములు సేకరించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే పనిలో ప్రభుత్వం బిజీగా ఉంది. ఇందులో భాగంగా కుప్పంలో విమానాశ్రయం పేరుతో భూముల సేకరణకు ప్రయత్నిస్తోంది. అయితే తమ జీవనానికి ఏకైక మార్గంగా ఉన్న భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. సర్వే పేరుతో ఇప్పటికే పలుమార్లు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. గతనెల 30వ తేదీన ఢిల్లీ నుంచి సర్వే కోసం వచ్చిన బృందాన్ని అడ్డుకున్నారు. సబ్ కలెక్టర్ మల్లికార్జున్, కడ ఎస్వో శ్యాంప్రసాద్ చెప్పినా రైతులు వినిపించుకోలేదు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భారీగా పరిహారం వస్తుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు సీఎంతో నేరుగా రైతులతో మాట్లాడించి న్యాయం చేస్తామని చెప్పినా పట్టు వీడలేదు. ‘‘ఆయన ఇంతవరకు చేసింది చాలు.. ఇన్నాళ్లు నమ్మి మోస పోయాం.. అసైన్‌మెంట్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు.. ఇప్పుడేమో పట్టా భూములు లాక్కోవాలని చూస్తున్నారు’’ అని మండిపడ్డారు. స్థానిక టీడీపీ నేతలను సైతం ఖాతరు చేయకుండా ఏకతాటిపై నిలిచారు.
హెరిటేజ్ ఎగుమతుల కోసమేనా?
కుప్పానికి 130 కిలోమీటర్ల దూరంలో దేవనహళ్లి ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కుప్పం నుంచి కోలార్ మీదుగా రెండు గంటలలో అక్కడికి చేరుకోవచ్చు. కుప్పం ప్రాంత రైతుల నుంచి తమిళనాడు ఏజెంట్లు పూలుకొని విదేశాలకు అక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. మరో ఆదాయ వనరు అయిన గ్రానైట్ రాయిని విమానాల ద్వారా ఎగుమతి చేసే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే హెరిటేజ్ పాల ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ద్వారా కూరగాయల ఎగుమతులకు తప్ప మరే ఉపయోగమూ ఉండదని రైతులు చెబుతున్నారు.