కన్నెర్రజేస్తాం..ఖబడ్దార్!
Published Fri, Jan 3 2014 4:11 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
సాక్షి, రాజమండ్రి :రాజమండ్రిలో రామకృష్ణ థియేటర్ వెనుక ఆవలో నిర్మించిన గృహ నిర్మాణ సముదాయంలో ఫ్లాట్ల కేటాయింపునకు గురువారం లాటరీ నిర్వహించబోగా.. ఆటంకపరిచిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, ఇతర తెలుగుదేశం నాయకులకు ఎదురైన చేదు అనుభవమే అందుకు ఉదాహరణ. గతంలో ఎన్నడూ చోటు చేసుకోని ఈ పరిణామం నేతలకు వణుకు పుట్టించగా.. జనంలో వచ్చిన కొత్త చైత న్యాన్ని చాటి చెప్పింది.పట్టణ పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా రాజమండ్రిలో లాలాచెరువు, తాడితోట రామకృష్ణ థియేటర్ వెనుక, పేపరుమిల్లు వద్ద ధవళేశ్వరంలలో సుమారు 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆరేళ్ల క్రితం నిర్మాణం మొదలైంది. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఈ నిర్మాణాలు పూర్తి చేయడంలో తీవ్రజాప్యం చేసింది. అధికార పార్టీ ప్రతినిధులు తమ అనుయాయులకు ఇళ్లు కేటాయిస్తూ అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు చెలరేగిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇప్పటివరకూ ఆ ఇళ్లు అందలేదు. బినామీలు, అనర్హులు ఇళ్లు సంపాదించగా అధికారులతో పోరాడలేక అర్హులైన వారు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లాలాచెరువు వద్ద ఇళ్ల కేటాయింపులు చేపట్టిన అధికారులకు లబ్ధిదారులు నిరసనల సెగ చూపించారు. తాజాగా గురువారం రామకృష్ణ థియేటర్ వెనుక ఆవలో నిర్మించిన 2256 గృహాల సముదాయానికి సంబంధించి లబ్ధిదారులకు లాటరీ ద్వారా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
గతంలో ఏ నేతకూ ఈ గతి పట్టలేదు..!
ఆరేళ్లుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఇన్నాళ్లకు కొత్త సంవత్సరంలో కొత్త ఇల్లు సొంతం కానుందని సంతోషిస్తుంటే.. టీడీపీ నేతలు, కార్యకర్తలు లాటరీ కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతును పిలిచి తమ పార్టీకి చెందిన రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్‌ను పిలవలేదంటూ మాజీ మంత్రి గోరట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో అడ్డుపడ్డారు. ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ డ్రా తీసే స్లిప్పులను చించేశారు. దీంతో లబ్ధిదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గోరంట్లతో సహా టీడీపీ వారిని రాళ్ళతో కొట్టారు, రోడ్డు మీది దుమ్మెత్తి పోశారు. ఈ పరిణామాన్ని ఊహించని గోరంట్ల మ్లానవదనంతో, అవమానభారంతో అక్కడి నుంచి ఉడాయించాల్సి వచ్చింది. బహుశా.. ఇలాంటి దుస్థితి గతంలో జిల్లాలో ఏ నేతకూ ఎదురై ఉండదని అంటున్నారు.
కొనసాగుతున్న రాజకీయ రచ్చ
ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రోజుకో జాబితా తయారు చేసి తమ వాళ్లకు పెద్ద పీట వేశారని, కార్పొరేటర్లకు పంపకాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో గృహ నిర్మాణానికి చాలాకాలం గ్రహణం పట్టింది. వేలాది రూపాయలు వడ్డీలకు తెచ్చి డీడీలు కట్టిన వారు జాబితాల్లో పేర్లు కనిపించక ఆవేదన చెందారు. చివరికి వివాదాలు సద్దుమణిగి ఇళ్లు కేటాయించే సమయంలో ఆ కార్యక్రమాన్ని కాస్తా రాజకీయరచ్చగా మార్చడం పట్ల పేదలు నిప్పులు కక్కుతున్నారు. ఉవ్వెతున్న ఎగసిన లబ్ధిదారుల ఆగ్రహాన్ని చూశాక కూడా టీడీపీ, కాంగ్రెస్ నేతలు వారి వారి రాజకీయ ఎత్తుగడలు కొనసాగించారు. గృహాల కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు తాడితోట సెంటర్ వద్ద ధర్నా చేసయగా ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తన అనుచరులతో మద్దతు పలికారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన రౌతు ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఇళ్ల కేటాయింపులు చేసి తీరుతామన్నారు. ప్రస్తుతం ఇళ్లు నిర్మించిన స్థలాన్ని గతంలో గోరంట్ల అమ్ముకోజూశారని ఆరోపించారు. కాగా అంతకు ముందు గోరంట్ల తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఇళ్లను అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతిని ఎండగడతామన్నారు. కాగా తమ దాడికి కాంగ్రెస్ నాయకులే కారణమంటూ టీడీపీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు..
వీరేం నేతలు సార్..!
వడ్డీలకు తెచ్చి రూ.45 వేలు కట్టాను. ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. ఇన్నాళ్లకు మా ఆశలు నెరవేరుతున్నాయంటే ఈ నాయకులు రాజకీయాలు చేసి ఇళ్లు రానీకుండా చేస్తున్నారు. వీళ్లు పెట్టరు.. పెట్టనివ్వరు. వీరేం నేతలు సార్!
- ధవళేశు లక్ష్మి, రాజమండ్రి
పండుగ చేసుకోవాలనుకున్నాం..
కొత్త సంవత్సరం ఇళ్లు వస్తాయని ఆశపడ్డాము. మా అబ్బాయితో కలిసి ఇక్కడికి వచ్చాను. మా కాలనీలో పండుగ చేసుకోవాలని అనుకున్నాము. కానీ ఇళ్లు ఇచ్చే సమయానికి నాయకులు అడ్డుకున్నారు. వీరేం పెద్దమనుషులు?
- సత్యవతి (లబ్ధిదారుడైన
వికలాంగుడు రమణ తల్లి)
రాజమండ్రి
Advertisement
Advertisement