నేను రాను.. మీకో దండం..! | Ayyanna Pathrudu Apsent to TDP party Meeting Guntur | Sakshi
Sakshi News home page

నేను రాను.. మీకో దండం..!

Published Mon, Dec 17 2018 1:51 PM | Last Updated on Mon, Dec 17 2018 1:51 PM

Ayyanna Pathrudu Apsent to TDP party Meeting Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయితే సమన్వయ కమిటీ సమావేశాలకు సైతం డుమ్మా కొడుతుండటం హాట్‌ టాపిక్‌గా మారింది. సమన్వయ కమిటీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలను పట్టించుకోకపోవడంతో అందరూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంతోనే నవంబర్‌ నెలలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరగలేదని సొంతపార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

తీర్మానాలు గాలికి..
జిల్లాలో ఖాళీగా ఉన్న గుంటూరు మిర్చి యార్డు, జిల్లా గ్రంథాలయ సంస్థలకు పాలక వర్గాలను నియమించాలని రెండు నెలల క్రితమే తీర్మానించి పార్టీ అధిష్టానానికి పంపినప్పటికీ ఇప్పటి వరకూ వాటిపై నిర్ణయం తీసుకోలేదు. ఇక ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలైతే ఇందుకేనా మిమ్మల్ని గెలిపించిందంటూ నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియకే సమన్వయ కమిటీ సమావేశాలకు రాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారనే వాదన వినిపిస్తోంది..    

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉండే గుంటూరు జిల్లా టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. పార్టీ నేతలకు నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వకుండా అధిష్టానం నిర్లక్ష్యం వహిస్తుందని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ నేత వెన్నా సాంబశివారెడ్డిని, వైస్‌ చైర్మన్‌గా ఏడుకొండలును నియమించాలని నాలుగు నెలల క్రితం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో తీర్మానించి ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపారు. దీనికి తోడు పాలక వర్గాన్ని సైతం రెండు నెలల క్రితం జరిగిన సమావేశంలో ఫైనల్‌ చేశారు. ఇప్పటి వరకూ వీళ్ళను నియమించిన దాఖలాలు లేవు. జేసీ ఇంతియాజ్‌ను పర్సన్‌ ఇన్‌చార్జిగా నియమించి వదిలేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పోస్టుతోపాటు పాలక మండలిని సైతం నియమించాలని ప్రతిపాదనలు పంపినా అధిష్టానం పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు నాలుగున్నరేళ్ళలో రెండు, మూడు సమావేశాలకు మాత్రమే హాజరుతున్నారు.

విభేదాలు బట్టబయలు
సమన్వయ కమిటీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగుతుండటం, ఏ ఒక్క పని ముందుకు సాగకపోవడం, నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వకుండా పార్టీ అధిష్టానం తాత్సారం చేస్తుండటంతో ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు డుమ్మా కొడుతున్నారు. గత నెల జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ముఖం చాటేయడంతో సమావేశం జరగలేదు. మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు పార్టీని వీడటం, మరి కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సైతం పక్క చూపులు చూస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్న తరుణంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న తీరుతో మరింత మంది పార్టీని వీడే ప్రమాదం ఉందని హడలిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితిపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.             

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement