సాక్షి, సిటీబ్యూరో: తెలిసిన అమ్మాయికి ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడం, మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే ప్రతిష్టాత్మకమైన కళాశాలలో సీటు సంపాదించడంతో ఈర్ష్య చెందిన ఓ బీటెక్ విద్యార్థి సైబర్ నేరానికి పాల్పడ్డాడు. ఆమె వెబ్‌కౌన్సిలింగ్‌కు సంబంధించిన వివరాలు సేకరించి ఆ సీటు రద్దు చేసి, మరో కళాశాలలో సీటు రిజర్వ్ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్, సైబర్‌క్రైమ్ విభాగం పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి మంగళవారం జైలుకు తరలించారు. డీసీపీ లేళ్ల కాళిదాస్ వేంకట రంగారావు అందించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన నల్లా మణిదీపిక ఈ ఏడాది జరిగిన ఎంసెట్‌లో 7040 ర్యాంకు సాధించి, హైదరాబాద్‌లోని జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో సీటు సంపాదించింది. గత నెల 1న దీపిక కాలేజీలో చేరేందుకు వెళ్లింది.
అయితే, తమ కాలేజీలో సీటు రద్దు అయిందని, రెండో విడత కౌన్సిలింగ్‌లో కీసరలోని హోలీమేరీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు వచ్చిందని యాజమాన్యం చెప్పడంతో నిర్ఘాంతపోయిన దీపిక.. తాను రెండో విడత కౌన్సిలింగ్‌లో పాల్గొనకపోయినా.. ఉద్దేశపూర్వకంగా ఎవరో చేసి ఉంటారనే అనుమానంతో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు కేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు గండిపేటలోని ఎస్‌ఎస్‌జే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సాయి భరతే ఇదంతా చేశాడని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. భరత్ స్వస్థలం కూడా మధిరే. దీపిక, భరత్ కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయి. దీపికకు మంచి కళాశాలలో సీటు వచ్చిన విషయం తెలుసుకుని ఈర్ష్యకు లోనైన భరత్ ఆమె సోదరుడితో పాటు ఇతర మార్గాల ద్వారా వెబ్‌కౌన్సిలింగ్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ తెలుసుకున్నాడు. ఓ స్నేహితుడి ల్యాప్‌టాప్ ద్వారా లాగిన్ అయి మొదటి సీటు రద్దు చేసి, రెండో సీటు రిజర్వ్ చేశాడు.
కటకటాల్లోకి చేర్చిన ఈర్ష్య... సైబర్ నేరంలో బీటెక్ విద్యార్థి అరెస్టు
Published Wed, Oct 23 2013 4:02 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement