Telangana EAMCET 2020: Web Option Counselling Postponed for a Week | తెలంగాణ ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు వారంపాటు వాయిదా - Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు వారంపాటు వాయిదా

Published Mon, Oct 12 2020 1:50 AM | Last Updated on Mon, Oct 12 2020 10:39 AM

EAMCET 2020 Counselling Postponed In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌–2020 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు ఇంకా ప్రభుత్వ అను మతి రాకపోవడం, ఇటు కాలేజీలకు యూని వర్సిటీ అఫిలియేషన్‌ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఈమేరకు కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు జరిగాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ మొదలు కాగా, సోమవారం (ఈనెల 12న) నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.

బీటెక్‌లో కొత్త కోర్సులకు అనుమతి రాకపోవడంతో పాటు అఫిలియేషన్ల ప్రక్రియలో జాప్యం జరగడంతో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను వారం పాటు వాయిదా వేశారు. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి వెబ్‌ఆప్షన్లు ఇచ్చేకునేలా వెబ్‌సైట్‌లో అధికారులు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 22వరకు ఆప్షన్లు ఇచ్చేలా వీలు కల్పించారు. అదేరోజు ఆప్షన్లు ఫ్రీజ్‌ కావడంతో ఈనెల 24న సీట్ల అలాట్‌మెంట్‌ పూర్తవుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28వ తేదీ వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్, కాలేజీలో ట్యూషన్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలి.

కరోనా నేపథ్యంలో..
రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ కోర్సుల్లో 1,10,873 సీట్లున్నాయి. ఈమేరకు ప్రతి కాలేజీకి ఏటా యూనివర్సిటీ అఫిలి యేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న కాలేజీలే కౌన్సెలింగ్‌లో పాల్గొం టాయి. వాస్తవానికి ఈ అఫిలియేషన్‌ ప్రక్రియ మే నెలాఖరు నాటికే పూర్తవుతుండటంతో ఆ తర్వాత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఈ కాలేజీల పేర్లు కనిపిస్తాయి. కానీ ప్రస్తుత కోవిడ్‌ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో అఫిలియేషన్ల ప్రక్రియ తీవ్ర జాప్యం జరిగింది. ప్రస్తుతం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అఫిలియేషన్‌ ప్రక్రియ పూర్తికాలేదు. మరోవైపు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోగా.. వీటికి ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. దీంతో బీటెక్‌లో కొత్తగా 15,690 సీట్లు పెరగనున్నాయి.

అయితే ఈ కోర్సులు, సీట్లను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎంసెట్‌ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అఫిలియేషన్, కొత్త కోర్సుల అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈమేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ రివైజ్డ్‌ షెడ్యూల్‌ను జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement