కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 'భూసేకరణ'
విజయవాడ: కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 2013 - భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ నరేంద్ర మోదీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసిందని సీపీఎం పాలిటిబ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు. దీని వెనక ఏపీ ప్రభుత్వం ఒత్తిడి ఉందని విమర్శించారు. ఆ ఆర్డినెన్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేకుంటే ఆందోళన తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని కోసం సేకరిస్తున్న 35 వేల ఎకరాల భూసేకరణలో ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవన్నారు. రాజధాని అనేది ప్రజల పాలన కోసం తప్పతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమో లేక రాజకీయ తాబేదారుల కోసమో ఏర్పాటు చేయకుడదని ప్రభుత్వానికి ఈ సందర్భంగా బి.వి.రాఘవులు హితవు పలికారు.