
వికలాంగులను మోసగించిన బాబు
కడప సెవెన్‌రోడ్స్ : అధికార వ్యామోహంతో చివరకు వికలాంగులను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసగించారని కడప మేయర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా ధ్వజమెత్తారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిర్వహించిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్‌ను రూ.1500కు పెంచుతామని ప్రకటించిన బాబు, ఇప్పు డు ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించిన సీఎం చివరకు వికలాంగులను మోసగించి తమకు మానవత్వం లేదని నిరూపించుకున్నారని నిప్పులు చెరిగారు. వికలాంగుల పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఏం సాధించారని బాబు వంద రోజుల సంబ రాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. పింఛన్లకు అర్హులను ఎంపిక చేసే కమిటీల్లో సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలను నియమిస్తున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి పింఛన్లన్నీ టీడీపీ అనుయాయులకు కట్టబెట్టేందుకు మరో నాటకానికి తెర లేపారని విమర్శించారు. వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, జిల్లా నాయకులు చిన్న సుబ్బయ్య, బీఎన్ బాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, వైఎస్సార్‌సీపీ నాయకుడు షఫీ, దళిత మహాజన ఫ్రంట్ కన్వీనర్ సంగటి మనోహర్, ఏపీ బీసీ మహాసభ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం కన్వీనర్ జేవీ రమణ, ఎన్‌ఆర్‌ఐ ట్రస్టు చైర్మన్ తోట కృష్ణ, ప్రముఖ సంఘసేవకుడు సలావుద్దీన్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బీసీ గంగులు, సీపీఐ నాయకుడు ఎల్.నాగసుబ్బారెడ్డి పాలొన్నారు.