చిన్నారి నవ్య శ్రీ, చిన్నారి నవ్య శ్రీ కోసం మహామండపం వద్ద రోదిస్తున్న తల్లి్ల శ్రీదేవి
సాక్షి, విజయవాడ/నరసరావుపేట టౌన్: ఇంద్రకీలాద్రిపై చిన్నారి మిస్సింగ్ ఉదంతం 12 గంటల పాటు ఉత్కంఠ రేపింది. చివరకు చిన్నారి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం అరసబలగాకు చెందిన పైడిరాజు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నవ్యశ్రీ (4)కాగా రెండో కుమార్తె నెలల పిల్ల. నవ్యశ్రీ విజయవాడ చిట్టినగర్‌లోని తాతయ్య కోరగంజి కృష్ణ ఇంట్లో ఉంటోంది. పైడిరాజు దంపతులు, కృష్ణ దంపతులు ఇటీవల తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు కొండపైన మల్లికార్జున మహామండపం వద్దకు చేరుకున్నారు.
సెల్‌ఫోన్లు భద్రపరుచుకునే కౌంటర్ వద్దకు వెళ్లిన సమయంలో కొద్ది నిమిషాలు నవ్యశ్రీని తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఆ తర్వాత పాప కనపడకపోవడంతో ఆ దంపతులు ఆందోళన చెందారు. ఆలయం వద్ద మైక్‌లో చెప్పించినా ఉపయోగం లేకపోవడంతో 10 గంటల ప్రాంతంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్జునవీధిలోని ఓ సీసీ కెమెరాను పరిశీలిస్తుండగా.. ఓ మహిళ చిన్నారిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు మరో మహిళ, ఓవ్యక్తి కూడా ఉన్నారు. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాలను పరిశీలించగా.. పాప పదో నంబర్ ప్లాట్‌ఫాంపై మహిళతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో బయలుదేరిన రైళ్లు గుంటూరు వైపుగా వెళ్లడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.
నరసరావుపేటలో పాప ఆచూకీ
ఉదయం కనకదుర్గమ్మ ఆలయంలో తప్పిపోయిన బాలిక రాత్రి గుంటూరు జిల్లా నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. నరసరావుపేటకు చెందిన చల్లా సుబ్బలక్ష్మి పాపను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. తాము ఆదివారం ఉదయం దుర్గమ్మ దర్శనానికి వెళ్లామని, తిరిగి వస్తుండగా పాప ఏడుస్తూ కనిపించిందని తెలిపారు. పాప వివరాలు చెప్పలేకపోయిందని, తమతో పాటే వచ్చేసిందని పేర్కొన్నారు. విజయవాడలో ఎవరికి అప్పగించాలో తెలియక నరసరావుపేట పోలీసులకు పాపను అప్పగించామని తెలిపారు. పాపను రాత్రి 10 తర్వాత పోలీసులు విజయవాడకు పంపారు. అమ్మదయతోనే తమ పాప దొరికిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పాప ఆచూకీ తెలిసిందన్నారు.
బయటపడ్డ భద్రత డొల్లతనం
దుర్గగుడిలో 79 కెమెరాలు ఉన్నాయి. అయినా పాప తప్పిపోయిన విషయం గుర్తించలేకపోయారు. అయితే మల్లికార్జున మహామండపం వద్ద ఉన్న కెమెరా వర్షానికి పాడైపోయిందని అధికారులు చెబుతున్నారు. ఘాట్‌రోడ్డు వద్ద, కొండపైన క్లోక్ రూమ్ వద్ద ఉన్న కెమెరాలు స్పష్టంగా కనపడటం లేదంటున్నారు. కీలకమైన ఈ ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయకపోయినా అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ మూడు కెమెరాలే పనిచేయడంలేదని అధికారులు చెబుతున్నా.. వాస్తవంగా సగం కెమెరాలు పనికిరానివేనని సమాచారం. అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాలు వద్ద కెమెరాలు తప్ప మిగిలినవేవీ పనిచేయడం లేదు.
అయినా అధికారులు కానీ, పాలకమండలి కానీ పట్టించుకోవడంలేదు. సీసీ కెమెరాలు పనిచేస్తే దేవస్థానం ఉద్యోగుల అక్రమాలు బయటపడతాయని సిబ్బంది కూడా ఈ విషయంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment