
ఆపరేషన్ అనంతరం చిన్నారి షీమాతో తల్లిదండ్రులు మహ్మద్ అబెదుల్లా, సాజియా, డాక్టర్ కవిత, డాక్టర్ బాబూలాల్, డాక్టర్ వెంకట సతీష్‌కుమార్
సాక్షి, గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ వైద్యురాలు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగేళ్ల చిన్నారి పొట్ట నుంచి సూది బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సబిన్‌కర్ బాబూలాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పొత్తూరు వారి తోటకు చెందిన మహ్మద్ అబెదుల్లా, సాజియా దంపతుల నాలుగేళ్ల కుమార్తె షీమా సోమవారం ఇంటి వద్ద ఆడుకుంటూ చేతికి అందిన సూదిని మింగేసింది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు.
కడుపులో నుంచి తీసిన సూది
పీడియాట్రిక్ సర్జరీ వైద్యులు వార్డులో అడ్మిట్ చేసుకుని ఎక్స్‌రే తీసి మింగిన సూది కడుపులో పేగులకు అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ కవితకు తెలియజేశారు. డాక్టర్ కవిత మంగళవారం షీమాకు కేవలం 8 నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ చేసి కడుపులో నుంచి సూదిని బయటకు తీశారు. చిన్నారి కడుపులో ఉన్న సూది నాలుగు సెంటీమీటర్ల పొడవుందని, ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా సూదిని బయటకు తీసినట్లు డాక్టర్ కవిత వెల్లడించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాబూలాల్, ఇతర అధికారులు, వైద్యులు డాక్టర్ కవితకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment