రుణమాఫీపై దుష్ర్పచారం: ప్రత్తిపాటి
హైదరాబాద్: రుణమాఫీని ప్రశంసించడానికి బదులు ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని, రైతు మనసుల్లో ప్రభుత్వ వ్యతిరేక భావన కల్పిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. వెల్లువెత్తుతున్న రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కారం కోసం రెండు రోజులుగా వివిధ స్థాయిల్లో కసరత్తు చేస్తున్నామన్నారు. రుణమాఫీ, క్షేత్రస్థాయి పరిస్థితిని ఎంపిక చేసిన ఎమ్మెల్యేలతో మంత్రి ప్రత్తిపాటి, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు గురువారమిక్కడ సమీక్షించారు.
కుటుంబరావు రాజకీయ విమర్శలు..: రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయగా, ఎలా చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. రుణమాఫీ వ్యవహారానికి తాను బాధ్యుడినని, అందుకే జగన్ విమర్శలకు స్పందిస్తున్నానని చెప్పారు.
పత్తి కుంభకోణంలో దోషుల్ని వదలం: రైతులకు దక్కాల్సిన రూ.221 కోట్ల భారత పత్తి సంస్థ (సీసీఐ) నిధుల్ని బయ్యర్లు, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై బొక్కేసిన వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో చెప్పారు. పత్తి కొనుగోళ్లపై సీబీఐ విచారిస్తోందని తెలిపారు.
రైతు రుణమాఫీ విజయయాత్ర వాయిదా: ఏపీ ప్రభుత్వం శుక్రవారం నుంచి చేపట్టదలిచిన రైతు రుణమాఫీ విజయయాత్ర వాయిదా పడింది. గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సచివాలయంలో సమావేశమైన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సీహెచ్ కుటుంబరావులు నిర్ణయం తీసుకున్నారు.