టీడీపీలో చేరిన బద్వేలు ఎమ్మెల్యే
సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే తిరువేదుల జయరాములు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో జయరాములుకి పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జయరాములు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తన ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేశానని, కానీ దురదృష్టమో, అదృష్టమో పార్టీ అధికారంలోకి రాలేదని పేర్కొన్నారు. అభివృద్ధికే తప్ప ప్రలోభాలకు లొంగి రాలేదని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి నచ్చక తాను బయటకు వచ్చానంటూ జరుగుతున్న ప్రచారంతో ఏకీభవించబోనని తెలిపారు.