నిషేధం ‘గుట్కా’య స్వాహా
- నగరంలో విచ్చలవిడిగా గుట్కా విక్రయాలు
- రెట్టింపు ధరలతో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
- కొరవడిన సర్కార్ పర్యవేక్షణ
- పట్టించుకోని అధికారులు
విశాఖ రూరల్ : తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా గుట్కా నిషేధం ప్రకటన చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో నగరంలో ఎక్కడికక్కడ గుట్కాలు విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, నిషేధ ఉత్తర్వులను అమలు చేయాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. బ్లాక్ మార్కెట్ పేరుతో రెట్టింపు ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ప్రయోజనాల కోసమే సర్కార్ నిషేధ ప్రకటన చేసిందేమో అనే పరిస్థితి దాపురించింది.
విశాఖ కేంద్రంగా గుట్కా రవాణా
రాష్ట్ర ప్రభుత్వం నిషేధం అమలు చేసిన తర్వాత గుట్కాలకు విశాఖ కేంద్రమైంది. అంతకుముందు జిల్లాల వారీగా గుట్కాల ఉత్పత్తుల కేంద్రాల నుంచి సరకును నేరుగా దిగుమతి చేసుకునేవారు. కానీ నిషేధం అమలు చేసిన తర్వాత గుట్కాల ఎగుమతులు, దిగుమతులకు విశాఖే కేంద్రమైంది. ముఖ్యంగా ఒడిశా నుంచి విచ్చల విడిగా రైళ్ల ద్వారా సరుకును విశాఖకు దిగుమతి చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. గుట్కాల వ్యాపారంలో ఓ కాంగ్రెస్ నేత విశాఖను కేంద్రంగా చేసుకుని ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు. వారికి పూర్ణా మార్కెట్‌లో ఉన్న ఓ బడా వ్యాపారి సహకరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిషేధాన్ని సాకుగా చూపి, రిస్క్ చేసుకుని వ్యాపారం చేస్తున్నామంటూ మరింత ఎక్కువ రేట్లుకు విక్రయాలు చేస్తున్నారు.
సొమ్ము చేసుకుంటున్న రిటైల్, చిల్లర వర్తకులు
బ్లాక్ మార్కెట్ పేరుతో హోల్‌సేల్ వ్యాపారులు రేట్లు పెంచేయడంతో తామేమి తక్కువ కాదన్నట్టు చిల్లర వర్తకులు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.
మూడు రూపాయల ఖైనీని రూ.5కు, రెండు రూపాయల పాన్ పరాగ్‌ను రూ.4కు, రూపాయి ఉండే డీలక్స్, సపారీలు రూ.2కు, రెండు రూపాయలుండే ఫైవ్ థౌజండ్‌ను రూ.4కు విక్రయిస్తున్నారు. ఈ విధంగా మొత్తం రేటులో 50 శాతాన్ని మధ్యవర్తులే తింటున్నారు. నిషేధం అమల్లో ఉన్నా వ్యాపారమేమి తగ్గలేదు. గతంలో రోజుకి రూ.5 కోట్ల టర్నోవర్ జరగగా ఇప్పుడు కూడా అదే స్థాయిలో వ్యాపారమవుతోంది.
పట్టించుకోని అధికారులు
నగరంలో ప్రతీ చిల్లర దుకాణంలో గుట్కాలు వేలాడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సంబంధిత శాఖలన్నీ తమకేమి పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. సర్కార్ పర్యవేక్షణ కూడా ఎక్కడా కనిపించడంలేదు. అసలు గుట్కాల నిషేధం అమలవుతుందా అనే దానిపై కనీసం సమీక్ష చేసిన దాఖలాలు లేవు. అధికారులకు సైతం ఆ దిశగా ఆదేశాలు జారీ చేయడం లేదు. దీంతో ఏ ఒక్క అధికారి సీరియస్‌గా తీసుకోవడం లేదు.
సుప్రీంకోర్టు నిషేధించినా..
పొగాకు సంబంధిత ఉత్పత్తుల ద్వారా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల తదితర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉందని సుప్రీంకోర్టు గుట్కాలపై నిషేధం విధించింది. పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జనవరి 5వ తేదీన నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. అయితే సర్కా ర్ ఆదేశాలను వ్యాపారులు పట్టించుకోలేదు. ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుంటున్నారు. నిషేధం పేరుతో బ్లాక్ మార్కెట్‌లో మరింత ఎక్కువ రేట్లుకు విక్రయిస్తున్నారు.