ఫిలిం చాంబర్ వద్ద నాగబాబు, అల్లు అర్జున్‌తో మాట్లాడుతున్న పవన్
సాక్షి, అమరావతి/ హైదరాబాద్: అశ్లీలాన్ని, నగ్నత్వాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ.. మన తల్లులు, కుమార్తెలు, అక్కచెల్లెళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రసారం చేస్తున్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లను బహిష్కరిం చాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన ట్విటర్‌లో ట్వీట్ చేశారు. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ హస్తం ఉందని ఆరోపించారు. రూ.10 కోట్లు ఖర్చు పెట్టి వారి మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా న్యూస్ మరికొన్ని ఇతర చానళ్ల ద్వారా తనపై, తన కుటుంబంపై నిరవధిక మీడియా ఆత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారు అని మండిపడ్డారు. మహా న్యూస్‌లో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పెట్టుబడులు లేదా ఆయన బినామీలు ఉన్నారని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ గురువారం రాత్రి వరుసగా ట్వీట్లు చేశారు. ‘‘గత ఎన్నికల సమయంలో ఏమీ ఆశించకుండా మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశా. కానీ, మీరు, మీ అబ్బాయి లోకేశ్, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చెయ్యిని వెనుకమాలగా మీ మీడియా శక్తుల ద్వారా చంపేస్తున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మడం. మీ ప్రభుత్వం రావడానికి మీకు అండగా నిలిచినందుకు మీరు నాకిచ్చిన ప్రతిఫలం ఇదేనా? ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదికగా చేసుకొని మీ కుమారుడు, అతని స్నేహితులు మీ మీడియా సంస్థలతో కలిసి కుట్రలు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే సంబంధం లేని విషయాల్లోకి లాగి నన్ను, నాకు జన్మనిచ్చిన తల్లిని నడ్డిరోడ్డుపై అసభ్యంగా పచ్చిబూతులు తిట్టించారు.
ఆ బూతులను మీ మీడియా ద్వారా పదేపదే ప్రసారం చేశారు. వాటిపై చర్చలు పెట్టారు. దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్‌లో పెట్టారు. దర్శకుడు వర్మ, శ్రీసిటీ ఓనర్ (టీవీ9 చానల్ ఓనర్) శ్రీనిరాజు, టీవీ9 రవిప్రకాశ్‌ల ద్వారా మీ అబ్బాయి లోకేశ్, అతని స్నేహితుడు కిలారు రాజేష్ కలిసి నాపై చేయిస్తున్న దుష్ప్రచారం మీకు తెలియదంటే నమ్మమంటారా?’’ అంటూ చంద్రబాబును పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో నిలదీశారు. సినిమా నటులను ఉద్దేశించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావును అంకుల్ అంటూ లోకేశ్ ఆప్యాయంగా పిలుస్తారని పేర్కొన్నారు.
నా షో మరికొద్ది రోజుల్లో చూపిస్తా
‘‘ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు. కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములే. వారు చెప్పిందే వేదం, పాడిందే నాదం’’ అంటూ కొన్ని మీడియా సంస్థల తీరుపై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ‘‘మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కా చెల్లెళ్లు ఉండి, కోడళ్లు, కుమార్తెలు ఉండి, పేరు ప్రఖ్యాతలు ఉండి, సంపదను కూడబెట్టుకుని... అన్నింటికీ మించి సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న మీరందరూ కలిసి ఏ కుమారుడూ తన తల్లి గురించి వినకూడని పదాలను నా తల్లి గురించి అనిపించారు.
మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారినప్పుడు అసిఫా లాంటి పసిపిల్లలపై దారుణమైన ఆత్యాచారాలు చేసే నీచులు, నికృష్టులు ఎందుకు ఉండరు? కోకొల్లలుగా ఉంటారు. మీ అందరూ కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్కాచెల్లెళ్లకు, మీ కుమార్తెలకు, కోడళ్లకు, మీ ఇంటిల్లిపాదికీ నా హృదయపూర్వక వందనాలు’’ అంటూ పవన్ ఎద్దేవా చేశారు. తన పట్ల వ్యవహరించిన మాదిరిగానే చంద్రబాబు, లోకేశ్ పట్ల వ్యవహరించే దమ్ముందా? అని సదరు మీడియా సంస్థలను ప్రశ్నించారు.
రాజకీయ నాయకుడి కంటే ముందు తాను ఒక తల్లికి కొడుకునని, తల్లికి రక్షణగా నిలబడలేనప్పుడు చనిపోయినా మంచిదనేది తన భావన అని పేర్కొన్నారు. వయసైపోతున్న తన 70 ఏళ్ల తల్లిని టీఆర్‌పీలు, రాజకీయ లాభాల కోసం దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌పీల కోసం నిర్వహిస్తున్న మీ షోలను మించి తన షోను కొద్ది రోజుల్లో చూపిస్తానని స్పష్టం చేశారు.
ఫిలిం చాంబర్ వద్ద పవన్ నిరసన
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ వద్ద నిరసనకు దిగారు. శుక్రవారం తన తల్లి, సోదరుడు నాగబాబుతో కలిసి చాంబర్‌లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) కార్యాల యానికి వచ్చారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన.. చేయించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ‘మా’ ప్రతినిధులు, నిర్మాతల మండలిని ప్రశ్నించారు. శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తాను ఉన్నానని ప్రకటించిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు వర్మపై న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్న అంశంపై అల్లు అరవింద్‌తో పాటు పవన్ న్యాయవాదులతో చర్చించారు.
పవన్‌కు మద్దతుగా వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్, వీవీ వినాయక్, రామ్‌చరణ్‌తేజ్, కేఎస్ రామారావు తదితరులు ఫిలిం చాంబర్‌కు వచ్చారు. తాజా పరిణామాలు, పవన్ కల్యాణ్ నిరసనపై శనివారం విస్తృత సమావేశం నిర్వ హించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయిం చింది. ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ప్రకటి స్తారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొం ది. కాగా, పవన్ వచ్చాడన్న విషయం తెలుసు కున్న ఆయన అభిమానులు ఫిలిం చాంబర్ వద్దకు చేరుకుని బైఠాయించి నినాదాలు చేశారు. కొంతమంది చాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఫిలింనగర్‌లో ఓ చానల్ వాహనాలను పవన్ అభిమానులు ధ్వంసం చేశారు. మరో చానల్ వాహనాలపై రాళ్లు రువ్విన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment