
సాక్షి, అమరావతి: అందరినీ అసభ్యంగా తిట్టడమే తెలుగుదేశం పార్టీ సంస్కృతి అంటూ జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, టీడీపీ, కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా మూడో రోజు ఆదివారం కూడా ఆయన పలు ట్వీట్లు చేశారు. ‘టీడీపీ జ్యోతిరత్న ఆర్కే! ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు అందరినీ అసభ్యంగా తిట్టించడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి.. బాగా శిక్షణ ఇస్తున్నారు.. కొనసాగించండి’ అంటూ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఉద్దేశించి పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ప్రత్యేక హోదా సాధనకు టీడీపీ మంచి వ్యూహంతో పనిచేస్తోందని మరొక ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. హోదా సాధన కోసం దేశ ప్రధానిని బండబూతులతో అత్యంత అభ్యంతరకర భాషలో తిట్టాలని సలహా ఇచ్చింది ఎవరు.. ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణేనని పేర్కొన్నారు. ‘ఆర్కే.. నువ్వు నడిపే పేపరు పేరు ఆంధ్రజ్యోతా? టీడీపీ జ్యోతా? ఎందుకంటే, అది ఆంధ్రులకు సంబంధించింది అయితే కాదు. అసలు ఎందుకంటున్నానో వచ్చే కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది’ అని మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు. బట్టలూడదీసి మాట్లాడుకుందాం.. బట్టలూడదీసి కొడదాం.. కార్యక్రమానికి ఆర్కేకు స్వాగతమంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.