- అనుమతి లేకుండా డబ్బు డ్రా చేసుకున్న అధికారులు
- అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిర్వాకం
- ప్రశ్నించిన డ్వాక్రా మహిళలపై మేనేజర్ చిందులు
- పత్రికల్లో వార్తలొస్తే ఇబ్బంది పడతారంటూ హెచ్చరిక
- మీకు అనవసరం అంటూ విలేకరులపై ఆగ్రహం
వైఎస్ఆర్ జిల్లా(ప్రొద్దుటూరు) :
డ్వాక్రా సంఘం సభ్యుల అనుమతి లేకుండా వారి ఖాతా నుంచి బ్యాంకు అధికారులు ఇష్టానుసారం డబ్బు డ్రా చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మహిళలపై సదరు బ్యాంకు మేనేజర్ చిందులు వేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన విలేకరులనూ కేసు పెడతానంటూ బెదిరించారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు మండలంలోని కానపల్లె గ్రామానికి చెందిన వీరాంజనేయ స్వయం సహాయక సంఘానికి పట్టణంలోని అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అధికారులు ఈ ఏడాది మే 18న రూ.5 లక్షలు రుణం మంజూరు చేశారు. జూన్ 1న 10 మంది గ్రూపు సభ్యులు కలిసి తీసుకున్న రుణానికి రూ.25 వేలు కంతు కట్టాల్సి ఉంది. ఈ విషయంపై మహిళలు సమావేశం నిర్వహించగా.. రుణం పొంది 12 రోజులే అయింది.. నెల పూర్తయ్యాక జూలై నుంచి కంతులు చెల్లిస్తే సరిపోతుందని ఆరుగురు మహిళలు చెప్పారు. దీంతో సభ్యులు జూన్ కంతు చెల్లించలేదు. గ్రూపు అధ్యక్షురాలు ఖాతాలోని డబ్బు తీసుకునేందుకు జూలై 3వ తేదిన బ్యాంక్‌కు వెళ్లగా ఖాతాల్లోంచి రూ.69 వేలు డ్రా చేసినట్లు ఆన్‌లైన్‌లో వెల్లడైంది. ఆందోళన చెందిన సభ్యులు బ్యాంక్ అధికారులను సంప్రదించగా మీకు బ్యాంక్ నిబంధనలు తెలియవని చెప్పారు. తమ గ్రూపు.. బ్యాంక్‌కు ఎలాంటి బాకీ లేదని, ఎందుకు కట్ చేశారని ప్రశ్నించారు. రుణం తీసుకుని 10 రోజులే కావడంతో జూన్ కంతు కట్టలేదని సభ్యులు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఏ లెక్క ప్రకారం రూ.69 వేలు కట్ చేశారో ఎవరికీ అర్థం కాలేదు.
- కానపల్లె గ్రామానికి చెందిన మరో గ్రూపునకు సంబంధించి గత ఏడాది బకాయిలు చెల్లించలేదని ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించిన మూలధనం రూ.30 వేలు ఏడీబీ అధికారులు డ్రా చేసుకున్నారు. ఖాతాలో మరోమారు కూడా డబ్బు డ్రా చేసుకున్నారని సభ్యులు తెలిపారు.
- ఖాదర్‌బాద్ గ్రామానికి చెందిన షేక్షావల్లి డ్వాక్రా గ్రూపునకు సంబంధించి మూలధనం రూ.30 వేలతో పాటు కొత్తగా మంజూరు చేసిన రుణంలో రూ.69 వేలు డ్రా చేసుకున్నారు. అగ్రికల్చల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ పరిధిలో సుమారు ఆరేడు వందల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మున్సిపాలిటీతోపాటు రూరల్ పరిధిలోని గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల డ్వాక్రా గ్రూపులకు రుణాలు మంజూరు చేసిన బ్యాంక్ అధికారులు ఇష్టారాజ్యంగా బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బు డ్రా చేసుకున్నారు. చాలా ఖాతాలదీ ఇదే పరిస్థితి.
మాకో నిబంధన.. మీకో నిబంధనా?
'డ్వాక్రా గ్రూపు మహిళలు డబ్బు తీసుకోవాలంటే పది మంది సభ్యులు వచ్చి బ్యాంక్ అధికారులకు కనబడితేకానీ రుణం ఇవ్వడం లేదు. అలాంటపుడు మా సంతకాలు లేకుండా, మాకు తెలియకుండానే డబ్బులు ఎలా డ్రా చేసుకుంటార'ని పలువురు మహిళలు ఏడీబీ మేనేజర్ అనంతకుమార్‌ను ప్రశ్నించారు. ఖాతాల్లోంచి పెద్ద ఎత్తున డబ్బులు బ్యాంక్ అధికారులు డ్రా చేశారని తెలియడంతో మంగళవారం మహిళలంతా బ్యాంక్‌కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మేనేజర్ కార్యాలయంలోకి వెళ్లారు. అంత డబ్బు ఎలా డ్రా చేసుకున్నారని ప్రశ్నించగా.. తమకు సర్వ హక్కులు ఉన్నాయని తెలిపారు. ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీరు ఏమైనా ఆస్తులు తనఖా పెట్టారా.. కేవలం మిమ్మల్ని చూసి రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ఈ తతంగం జరుగుతుండగా విలేకరులు మేనేజర్ చాంబర్ వద్దకు వెళ్లి ఫొటో తీసుకున్నారు. అనుమతి లేకుండా లోపలకు వచ్చారని, కేసు పెడతానని మేనేజర్ బెదిరించారు. మీరే విలేకరులను తీసుకు వచ్చారని మహిళలపై మండిపడ్డారు. పత్రికల్లో వార్తలు వస్తే చాలా ఇబ్బందులు పడతారని వారినీ బెదిరించారు. కాసేపటి తర్వాత విలేకరులు మళ్లీ వెళ్లి ఆయన్ను సంప్రదించగా.. వాళ్లు (మహిళలు), మేము మాట్లాడుకున్నాం. ఈ సమస్య మీకు అనవసరం అని చెప్పారు.