agricultural devolpment bank
-
థాయిలాండ్‌లో.. ‘సహకారం’లోనే మార్కెటింగ్
హన్మకొండ : థాయిలాండ్ దేశంలో సహకార రంగంలోనే వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ కొనసాగుతోందని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. సహకార రంగంలో స్థిరమైన ఫైనాన్సింగ్ వ్యూహాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అంశంపై థాయిలాండ్‌కు స్టడీ టూర్‌కు వెళ్లి వచ్చిన మార్నేని సోమవారం ‘సాక్షి’తో అక్కడి విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మన దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ ప్రత్యేక వ్యవస్థగా కొనసాగుతుంటే థాయిలాండ్‌లో సహకార రంగంలోనే కొనసాగుతుంది. మన దేశంలో చిన్నచిన్న కమతాల్లో వ్యవసాయం చేస్తుంటే థాయిలాండ్‌లో కమతాలు చాలా విశాలంగా ఉంటాయి. ఒక్కో వ్యవసాయ క్షేత్రం 30 నుంచి 50 ఎకరాల వరకు ఉంటుంది. కుటుంబం మొత్తం వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. ఆ దేశంలో పంట ఉత్పత్తులకు విలువ జోడింపు చేస్తారు. దీంతో రైతులకు అధిక ఆదాయం వస్తుంది. వరితోపాటు పండ్లు, కూరగాయలు వరితో పాటు, పండ్లు, కూరగాయల పంటలు సాగు చేస్తారు. పండ్లు, కూరగాయల సాగు పాలీ హౌజ్‌ల్లోనే చేస్తారు. పంట ఉత్పత్తులను రైతులే ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తారు. ప్రతి వ్యవసాయ క్షేత్రం కంపెనీని తలపిస్తుంది. భారత్‌లో 80 శాతం ఆధారపడితే థాయిలాండ్‌లో 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడుతారు. అక్కడ సాగునీటి వనరులు తక్కువ. మార్కెటింగ్ మన దగ్గర అంత సానుకూలంగా ఉండదు. అదే థాయిలాండ్‌లో సులువుగా ఉంటుంది. థాయిలాండ్ ప్రధానంగా పర్యాటక ప్రాంతంగా ప్రఖ్యాతి గాంచింది. మన దేశంలోనే కేంద్ర సహకారం పెరిగితే సహకార రంగం పురోభివృద్ధి సాధిస్తుంది. అధ్యయనానికి వస్తామన్నారు.. తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా గురించి చెప్పితే ఇలా కూడా ఉంటుందా అని థాయిలాండ్ దేశస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విష యం విన్న వారు తెలంగాణకు వచ్చి అధ్యయ నం చేస్తామని చెప్పారు. సహకార వ్యవస్థలో నూ తన విధానాలు తీసుకురావడానికి ఈ స్టడీ టూర్ కు వెళ్లాం. 22వ తేదీన బ్యాంకాక్‌లోని హోటల్ సెంట్రో వాటర్గేట్లో సమావేశమై వివిధ సహకార సంఘాల పనితీరు.. వ్యవస్థ విధి విధానాల పై చర్చించాం. రెండో రోజు బ్యాంకాక్‌లోని సహకార శాఖ కార్యాలయాలు, వాటి పనితీరును అఽ ద్యయనం చేశాం. మూడోరోజు బోతాంగ్ జిల్లా థాట్తంగ్లో గల పంటలను పరిశీలించాం. -
విరివిగా రుణాలు..!
నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు విరివిగా అందజేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నిర్ణయించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రైతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలు, ఉన్నత చదువుల కోసం రైతుల బిడ్డలకు రుణాలు అందజేయనుంది. పంట రుణాలను ఇవ్వడంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న డీసీసీబీ ఈ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి మొత్తం రూ.450 కోట్ల పంట రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఖరీఫ్‌లో రూ.270 కోట్లు, రబీలో రూ.180 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం సుమారు రూ.20 కోట్ల మేరకు దీర్ఘకాలిక రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయేతర రుణాలు సైతం.. జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 స్వయం సహాయక సంఘాలకు డీసీసీబీ ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ.40 కోట్ల వరకు రుణాలను ఇవ్వనుంది. వివిధ సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతుల బిడ్డల ఉన్నత చదువులకు లోన్స్ అందజేయనుంది. ఇందుకు అన్ని పత్రాలను సమర్పించిన వారం రోజుల్లోగా విద్యా రుణాలను అందించాలని నిర్ణయించింది. ఒక్కో విద్యార్థికి రూ.30 లక్షల వరకు రుణం ఇవ్వాలని యోచిస్తోంది. విద్యారుణాల కోసం ఎక్కువ డిమాండ్ ఉండడంతో గత సంవత్సరం కంటే రెట్టింపు స్థాయిలో విద్యార్థులకు రుణాలను ఇవ్వాలని భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్ గోల్డ్ లోన్ పథకాన్ని ప్రారంభించి గ్రాము బంగారంపై రూ.2200 వరకు తక్కువ వడ్డీతో ఆరునెలల కాలపరిమితిలో చెల్లించే విధంగా రుణాలను ఇవ్వడాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అదే విదంగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలను ఇవ్వాలని భావిస్తోంది. ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇవ్వడానికి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 13 ఏటీఎంలతో పాటు మొబైట్ ఏటీఎంలు సమకూర్చుకుని ఆదాయాన్ని పెంచుకుంటున్న జిల్లా సహకార బ్యాంకు నూతనంగా మఠంపల్లి, మునగాల, మునుగోడులో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏటీఎంల ద్వారా ప్రజలకు తమ సేవలను మరింత విస్తరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం.. 2008 సంవత్సరంలో రుణమాఫీ అర్హత పొందని రైతులకు వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించా రు. అసలు వడ్డీపై 35 శాతం తగ్గించి రుణాల ను చెల్లించే వెÐðసులుబాటును కల్పిలంచారు. జూన్ 30 వరకు చెల్లించే వారికి వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో పాటు బ్యాంకులో పేరుకుపోయిన వ్యవయేతర రుణాలను చెల్లించే వారికి సైతం వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం ఇవ్వనున్నా రు. రుణానికి సమానంగా వడ్డీ చెల్లించే వెసులుబాటును కూడా కల్పించి పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రికవరీ బృందాలను ఏర్పాటు చేసి వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా బకాయిలు వసూలు చేసుకునే పనిలో బ్యాంకు అధికారులు నిమగ్నమయ్యారు. బ్యాంకు అభివృద్ధికి సహకరించాలి రైతులకు విరివి గా రుణాలు ఇ వ్వాలని నిర్ణయించాం. రైతులతో పాటు ఉ ద్యోగులు, ఇతర వ్యాపారవర్గాలు తమ నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు అబివృద్ధికి సహకరించాలి. పంట రుణాలను ఇవ్వడంతో అన్ని బ్యాంకులకంటే తామే ముందుం టున్నాం. పేరుకుపోయిన బకాయిల కోసం వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించాం. రుణాల ను సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి దోహదపడాలి. – కె.మదన్మోహన్, డీసీసీబీ, సీఈఓ -
17న ‘సహకార’ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలకు ఈ నెల 17న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర సహకారశాఖ రంగం సిద్ధం చేసింది. పంచాయతీ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరి రెండో వారంలో ఒకే రోజున 906 ప్యాక్స్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపట్టి గెలుపొందిన కమిటీని ప్రకటించనున్నారు. ఆ వెంటనే తొమ్మిది డీసీసీబీలు, తొమ్మిది జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలతోపాటు టెస్కాబ్‌ల ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియంతా ఫిబ్రవరి 25కల్లా ముగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకంటే ముందే ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ముమ్మరం చేసింది. ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా కూడా తుది దశకు చేరుకుంది. రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాల నుంచి ఓటర్ల జాబితా ఎన్నికల అథారిటీకి అందింది. ఇందులో మొత్తం 18 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. మిగిలిన రెండు జిల్లాల నుంచి కూడా జాబితా వస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. సహకార సంఘంలో ఏడాది, అంతకంటే ఎక్కువ కాలం మెంబర్‌గా కొనసాగిన వారినే ఓటరుగా గుర్తించనున్నారు. పూర్తిస్థాయిలో అన్ని జిల్లాల నుంచి ఓటర్ల జాబితా రాష్ట్ర సహకారశాఖ రిజిస్ట్రార్ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. వాటన్నింటిపై రాష్ట్రస్థాయిలో సహకారశాఖ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. ఆ తరువాత తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్యాక్స్లకు పర్సన్ ఇన్చార్జీలు పాలక వర్గాలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి గతేడాది జనవరిలో కొన్ని, ఫిబ్రవరిలో కొన్ని ప్యాక్స్లకు పదవీకాలం ముగిసింది. దీంతో ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికలను నిర్వహించే సమయానికి పర్సన్ ఇన్చార్జీల పాలనకు సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. మరోవైపు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుంచి ఇవ్వనున్నారు. గతంలో ఎన్నికల అధికారి ప్రతిపాదనలు సమర్పించి సొసైటీ నుంచే ఖర్చు చేసే విధానం ఉండేది. అయితే అందులో లోటుపాట్లు, అవినీతి చోటుచేసుకుంటున్నందున ఇటీవల ఎన్నికల నిబంధనల్లో భాగంగా ఈ మేరకు సవరణ తీసుకువచ్చారు. 50 మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్న సొసైటీలకు చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా భద్రాచలం ప్యాక్స్‌కు చేతులెత్తే విధానంలోనే ఎన్నిక నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు... ప్యాక్స్ ఎన్నికలకు 12 వేల బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 40 వేల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వివిధ శాఖల ఉద్యోగులు ప్యాక్స్ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్ల కోసం పంచాయతీ ఎన్నికల్లో తమ శాఖ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే సహకారశాఖ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. -
మా బ్యాంకు.. మా ఇష్టం
అనుమతి లేకుండా డబ్బు డ్రా చేసుకున్న అధికారులు అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నిర్వాకం ప్రశ్నించిన డ్వాక్రా మహిళలపై మేనేజర్ చిందులు పత్రికల్లో వార్తలొస్తే ఇబ్బంది పడతారంటూ హెచ్చరిక మీకు అనవసరం అంటూ విలేకరులపై ఆగ్రహం వైఎస్ఆర్ జిల్లా(ప్రొద్దుటూరు) : డ్వాక్రా సంఘం సభ్యుల అనుమతి లేకుండా వారి ఖాతా నుంచి బ్యాంకు అధికారులు ఇష్టానుసారం డబ్బు డ్రా చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మహిళలపై సదరు బ్యాంకు మేనేజర్ చిందులు వేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన విలేకరులనూ కేసు పెడతానంటూ బెదిరించారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు మండలంలోని కానపల్లె గ్రామానికి చెందిన వీరాంజనేయ స్వయం సహాయక సంఘానికి పట్టణంలోని అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు ఈ ఏడాది మే 18న రూ.5 లక్షలు రుణం మంజూరు చేశారు. జూన్ 1న 10 మంది గ్రూపు సభ్యులు కలిసి తీసుకున్న రుణానికి రూ.25 వేలు కంతు కట్టాల్సి ఉంది. ఈ విషయంపై మహిళలు సమావేశం నిర్వహించగా.. రుణం పొంది 12 రోజులే అయింది.. నెల పూర్తయ్యాక జూలై నుంచి కంతులు చెల్లిస్తే సరిపోతుందని ఆరుగురు మహిళలు చెప్పారు. దీంతో సభ్యులు జూన్ కంతు చెల్లించలేదు. గ్రూపు అధ్యక్షురాలు ఖాతాలోని డబ్బు తీసుకునేందుకు జూలై 3వ తేదిన బ్యాంక్‌కు వెళ్లగా ఖాతాల్లోంచి రూ.69 వేలు డ్రా చేసినట్లు ఆన్లైన్లో వెల్లడైంది. ఆందోళన చెందిన సభ్యులు బ్యాంక్ అధికారులను సంప్రదించగా మీకు బ్యాంక్ నిబంధనలు తెలియవని చెప్పారు. తమ గ్రూపు.. బ్యాంక్‌కు ఎలాంటి బాకీ లేదని, ఎందుకు కట్ చేశారని ప్రశ్నించారు. రుణం తీసుకుని 10 రోజులే కావడంతో జూన్ కంతు కట్టలేదని సభ్యులు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఏ లెక్క ప్రకారం రూ.69 వేలు కట్ చేశారో ఎవరికీ అర్థం కాలేదు. - కానపల్లె గ్రామానికి చెందిన మరో గ్రూపునకు సంబంధించి గత ఏడాది బకాయిలు చెల్లించలేదని ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించిన మూలధనం రూ.30 వేలు ఏడీబీ అధికారులు డ్రా చేసుకున్నారు. ఖాతాలో మరోమారు కూడా డబ్బు డ్రా చేసుకున్నారని సభ్యులు తెలిపారు. - ఖాదర్‌బాద్ గ్రామానికి చెందిన షేక్షావల్లి డ్వాక్రా గ్రూపునకు సంబంధించి మూలధనం రూ.30 వేలతో పాటు కొత్తగా మంజూరు చేసిన రుణంలో రూ.69 వేలు డ్రా చేసుకున్నారు. అగ్రికల్చల్ డెవలప్మెంట్ బ్యాంక్ పరిధిలో సుమారు ఆరేడు వందల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మున్సిపాలిటీతోపాటు రూరల్ పరిధిలోని గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల డ్వాక్రా గ్రూపులకు రుణాలు మంజూరు చేసిన బ్యాంక్ అధికారులు ఇష్టారాజ్యంగా బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బు డ్రా చేసుకున్నారు. చాలా ఖాతాలదీ ఇదే పరిస్థితి. మాకో నిబంధన.. మీకో నిబంధనా? 'డ్వాక్రా గ్రూపు మహిళలు డబ్బు తీసుకోవాలంటే పది మంది సభ్యులు వచ్చి బ్యాంక్ అధికారులకు కనబడితేకానీ రుణం ఇవ్వడం లేదు. అలాంటపుడు మా సంతకాలు లేకుండా, మాకు తెలియకుండానే డబ్బులు ఎలా డ్రా చేసుకుంటార'ని పలువురు మహిళలు ఏడీబీ మేనేజర్ అనంతకుమార్‌ను ప్రశ్నించారు. ఖాతాల్లోంచి పెద్ద ఎత్తున డబ్బులు బ్యాంక్ అధికారులు డ్రా చేశారని తెలియడంతో మంగళవారం మహిళలంతా బ్యాంక్‌కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మేనేజర్ కార్యాలయంలోకి వెళ్లారు. అంత డబ్బు ఎలా డ్రా చేసుకున్నారని ప్రశ్నించగా.. తమకు సర్వ హక్కులు ఉన్నాయని తెలిపారు. ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీరు ఏమైనా ఆస్తులు తనఖా పెట్టారా.. కేవలం మిమ్మల్ని చూసి రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ఈ తతంగం జరుగుతుండగా విలేకరులు మేనేజర్ చాంబర్ వద్దకు వెళ్లి ఫొటో తీసుకున్నారు. అనుమతి లేకుండా లోపలకు వచ్చారని, కేసు పెడతానని మేనేజర్ బెదిరించారు. మీరే విలేకరులను తీసుకు వచ్చారని మహిళలపై మండిపడ్డారు. పత్రికల్లో వార్తలు వస్తే చాలా ఇబ్బందులు పడతారని వారినీ బెదిరించారు. కాసేపటి తర్వాత విలేకరులు మళ్లీ వెళ్లి ఆయన్ను సంప్రదించగా.. వాళ్లు (మహిళలు), మేము మాట్లాడుకున్నాం. ఈ సమస్య మీకు అనవసరం అని చెప్పారు.