క‘రుణ’ చూపని బ్యాంకులు | Bank Officials Are Negligent In Distributing Crop Loans | Sakshi

క‘రుణ’ చూపని బ్యాంకులు

Oct 13 2019 10:56 AM | Updated on Oct 13 2019 10:56 AM

Bank Officials Are Negligent In Distributing Crop Loans - Sakshi

సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌): కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రబీ పంటల సాగుకు అవకాశం ఏర్పడింది. అయితే అన్నదాతలకు బ్యాంకుల నుంచి చేయూత కరువైంది. రబీ పంట రుణాల పంపిణీని  ఇంతవరకు చేపట్టలేదు. ఖరీఫ్‌లో అంతంత మాత్రంగానే   రుణాలు పంపిణీ చేశాయి. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రబీలో ప్రధానంగా శనగ, జొన్న, ధనియాలు, మినుము, వేరుశనగ, వరి సాగుచేస్తారు. శనగ 1.90 లక్షల హెక్టార్లలో, వరి 25,119, జొన్న 56,397, మొక్కజొన్న 8,248, మినుము 14294 హెక్టార్లలో సాగు కానున్నాయి. ఖరీఫ్‌ సాధారణ సాగు 6.27 లక్షల హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 93 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. రబీ సీజన్‌కు వాతావరణం అనుకూలించడంతో ఉత్సాహంగా విత్తనం పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం కూడా రబీ రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేస్తోంది.  

రుణాలకు తప్పని తిప్పలు 
రైతులకు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ బ్యాంకర్లలో మార్పు రాలేదు. ఖరీఫ్‌ పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.4,360.42 కోట్లు ఉండగా, బ్యాంకులు మాత్రం రూ.3136.07 కోట్లు పంపిణీ చేసినట్లు స్పష్టం అవుతోంది. జిల్లాలో రైతుల ఖాతాలు 6.92 లక్షలు ఉన్నాయి. వీరందరూ పంట రుణాలకు అర్హులే. ఖరీప్‌లో కేవలం 3,53,212 మంది రైతులకు మాత్రమే పంట రుణాల పంపిణీ చేశాయి. ఎస్‌బీఐ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులు లక్ష్యాలను అధిగమించినా.. ఆంధ్రా, కెనరా , కేడీసీసీ బ్యాంకు లు నిర్లక్ష్యం వహించాయి. ఖరీఫ్‌లో ఈ నెల 10వ తేదీ నాటికి 71.92 శాతం మాత్రమే పం టరుణాల పంపిణీలో లక్ష్యాన్ని సాధించారు.  
 
రబీలో అంతులేని నిర్లక్ష్యం.. 
రబీలో 3 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది.  పంట రుణాల లక్ష్యం రూ.2749.58 కోట్లు.  జిల్లాలోని 27 బ్యాంకులకు లక్ష్యాలు ఇచ్చారు. ఏపీజీబీ రూ.562.14 కోట్లు, ఆంధ్రబ్యాంకు రూ.416.72 కోట్లు, ఎస్‌బీఐ రూ.412.70 కోట్లు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు రూ.419.52 కోట్లు, సిండికేట్‌ బ్యాంకు రూ.247.80 కోట్లు, కెనరా బ్యాంకు రూ. 114.62కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.102.89 కోట్లు ప్రకారం పంపిణీ చేసే విధంగా లక్ష్యలు ఇచ్చారు. కొన్ని మండలాల్లో ఆశాజనకంగా వర్షాలు పడటంతో కొద్ది రోజులుగా రబీ పంటల సాగు చేస్తున్నా.. పంట రుణాల పంపిణీ అతీగతీ లేదు. బ్యాంకులు మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాల్సి ఉంది.

రుణం ఇవ్వడం లేదు 
రైతు పేరు పెద్దమద్దిలేటి. సి.బెళగల్‌ మండలం పోలకల్‌ గ్రామవాసి. ఆరు ఎకరాల పొలం ఉంది. రబీ సీజన్‌లో శనగ వేయడానికి విత్తనాలు సిద్ధం చేసుకున్నాడు.  పంట రుణం కోసం ఆంధ్రాబ్యాంకు, పీఏసీఎస్‌ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్ని సార్లు తిరిగినప్పటికీ రుణం ఇవ్వడం లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement