మాఫీ చేస్తాం.. వేలం వేస్తాం
మంత్రి మాట
రైతులు తీసుకున్న రుణాలతోపాటు డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేస్తాం. వాళ్లెవరూ రుణాలు చెల్లించాల్సిన పనిలేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం. ఈ అంశాలపై తొలి మంత్రివర్గ సమావేశంలో చర్చించాం.
- ఈనెల 13న ఏలూరు, తణుకు, ఉంగుటూరులో పర్యటించిన సందర్భంలో రాష్ట్ర మంత్రి పీతల సుజాత చేసిన ప్రకటన ఇది
సాక్షి, ఏలూరు : రుణమాఫీ విషయమై రైతు లు, డ్వాక్రా మహిళలతో ప్రభుత్వం, బ్యాంకులు దోబూచులాడుతున్నాయి. రుణాలను మాఫీ చేస్తామని.. రైతులు, డ్వాక్రా మహిళలు బకాయిలను చెల్లించాల్సిన పనిలేదని మం త్రులు, ఎమ్మెల్యేలు చెబుతుంటే.. వెంటనే కట్టాలంటూ బ్యాంకర్లు వత్తిడి చేస్తున్నారు. నోటీసు లు ఇస్తున్నారు. బంగారు నగలను వేలం వేస్తామంటూ ప్రకటనలు సైతం జారీ చేస్తున్నారు. రుణమాఫీ ఖాయమని చెబుతున్న ప్రభుత్వం.. దీనిపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీని నియమించినట్టు ప్రకటించింది. హామీ అమలు విషయంలో మాత్రం నాటకీయత ప్రదర్శిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు రుణమాఫీ చేస్తామని చెబుతున్నా ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయూలో తెలియక రైతులు, డ్వాక్రా మహిళలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇలా మొదలైంది...న్నికల్లో నేలవిడిచి
సాము చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు అధికారమే పరమావధిగా ఎన్నో హామీలు గుప్పించారు. డ్వాక్రా, వ్యవసాయ రుణాలతోపాటు బంగారంపై తీసుకున్న రుణాలను సైతం రద్దు చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. బ్యాంకులకు రుణాలు కట్టొద్దని ప్రచారం చేశారు. జిల్లాలో 5,89,195 అకౌంట్ల ద్వారా బంగారం తాక ట్టు పెట్టిన రైతులు వ్యవసాయ అవసరాలకు రూ.3,204.76 కోట్లను రుణాలుగా పొందారు. వాటిలో చివరి మూడు నెలల్లో తీసుకున్న రుణాల మొత్తం రూ.1971.03 కోట్లు. గతేడాది 3,65,710 అకౌంట్ల ద్వారా రూ.2,951.78 కోట్లను బంగారం హామీపై బ్యాంకులు రుణాలు ఇచ్చారుు. ఆ మొత్తంలో దాదాపు 95శాతం రుణాలు వసూల య్యూయి. ఈ ఏడాది రుణమాఫీ అవుతుం దనే నమ్మకంతో రైతులు ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు తిరిగి కట్టలేదు. ఇప్పుడు వాటిని కట్టాల్సిందిగా బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి. నోటీసులకు స్పందించని వారి నగలను వేలం వేస్తామంటూ బహిరంగ ప్రకటనలు ఇస్తున్నాయి. చంద్రబాబు మాత్రం రుణమాఫీపై కమిటీ వేసి 45 రోజుల తర్వాత కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటానని చేతులు దులిపేసుకున్నారు. దీంతో ప్రైవేటు అప్పులు చేసి నగలు దక్కించుకోవాలో? లేక వాటిని వదులుకోవాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.925 కోట్లను రుణాలుగా ఇచ్చారు.
బ్యాంకులు వాటి పని అవి చేసుకుపోతున్నాయ్
బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలను చెల్లించాల్సిందిగా రైతులకు నోటీసులు ఇవ్వాలని మేం చెప్పలేదు. మొండి బకాయిలు, వ్యవసాయేతర అవసరాలకు బంగారంపై తీసుకున్న రుణాలను వసూలు చేయడానికి కొన్ని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. రుణ మాఫీకి సంబంధించి ఇప్పటివరకూ బ్యాంకులకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో బకాయిలు చెల్లించేందుకు రైతులు, డ్వాక్రా మహిళలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం బ్యాంకులు వాటి పని అవి చేసుకుపోతున్నాయి.
-ఎం.లక్ష్మీనారాయణ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్
బాబు చెప్పారని కట్టలేదు
వ్యవసాయ పెట్టుబడుల కోసం దర్భగూడెం బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నాను. 2010లో బంగారం తాకట్టు పెట్టి 50వేల రూపాయలు తీసుకోగా, దీనికి వడ్డీ 25వేలు వేశారు. మొత్తం బకాయిలు తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతోపాటు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. రైతులెవరూ బకాయిలు కట్టొద్దని, రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో మేం కట్టలేదు. రుణం మాఫీ అవుతుందో లేదో తెలియని పరిస్థితి. బ్యాంకు అధికారులు బంగారాన్ని వేలం వేస్తామంటున్నారు. ఏంచేయాలో దిక్కుతోచడం లేదు.
- జంగా లచ్చిరెడ్డి, రైతు, దర్భగూడెం
బ్యాంకులు వత్తిడి చేస్తున్నాయి
గత ఏడాది వ్యవసాయం కోసం క్రాప్ లోన్ కింద దర్భగూడెం బ్యాంకులో లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. బంగారాన్ని తాకట్టు పెట్టి 21వేల రూపాయలు అప్పు తెచ్చాను. దీనికి 6వేల రూపాయలు వడ్డీ వేశారు. మొత్తం సొమ్ము కట్టాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. రుణమాఫీ అవుతుందని నమ్మకం పెట్టుకున్నాం. అయితే రుణమాఫీకి గడువు విధించడంతో అది ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.
- ఏలూరి రామాంజనేయులు, రైతు, లక్ష్మీపురం
రుణ బకాయిలు ఇలా
జిల్లాలో 2014 జూన్ వరకు ఉన్న వ్యవసాయ రుణ బకారుులు
రుణం రకం అకౌంట్ల సంఖ్య రుణ మొత్తం (రూ. కోట్లలో)
పంట రుణాలు 6,34,932 3,921.92
గోల్డ్ లోన్స్ 5,89,195 3,204.76
టెర్మ్ లోన్స్ 1,64,971 2,015.95
సీసీఏటీఎల్ 55,810 597.31
ఎస్‌హెచ్‌జీ 6,45,000 925.00
పరోక్ష రుణాలు 10,122 2108.91
మొత్తం 21,000,30 12,773.85
ఇన్‌డెరైక్ట్ ఫైనాన్స్ : గోడౌన్లలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను తనఖాపెట్టి తీసుకున్న రుణాలు, చేపల చెరువులు, పొగాకు రైతులు తీసుకున్న రుణాలు
సీసీఏటీఎల్ : టెర్మ్‌లోన్లుగా మారిన క్రాప్ లోన్లు
ఎస్‌హెచ్‌జీ : స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలు