ఒట్టి హామీలే ! | Bare guaranteed! | Sakshi
Sakshi News home page

ఒట్టి హామీలే !

Published Thu, Oct 9 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

ఒట్టి హామీలే !

ఒట్టి హామీలే !

వినుకొండ/శావల్యాపురం/ సాక్షి,గుంటూరు:
 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో ఆద్యంతం ఒట్టి హామీలతోనే సరిపుచ్చారు. బుధవారం జిల్లాలోని వినుకొండ, రేపల్లె నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ఎక్కడా రైతుల ఊసెత్తలేదు. తొలుత వినుకొండ చేరుకున్న సీఎం అక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

     సుమారు అర్ధ గంటపాటు మాట్లాడిన విద్యార్థులు స్వచ్ఛ్ భారత్ ఆవశ్యకతను వివరించారు. పాఠ్యపుస్తకాల బరువుతో పడుతున్న అవస్థలను తెలియజేశారు. అన్నిచోట్లా అవినీతి పెచ్చుమీరిందని చెప్పారు. విద్యార్థుల ప్రసంగాలకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మెరికల్లా, చిచ్చరపిడుగుల్లా ఉన్నారంటూ వారిని అభినందించారు.

     అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ వినుకొండను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలో పశువైద్య కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంగా ఫ్లోరైడ్ బారిన పడుతున్న వినుకొండ, ఒట్టి హామీలే !

 ఠమొదటిపేజీ తరువాయి
 మాచర్ల, గురజాల ప్రాంతాల ప్రజలకు సాగర్ జలాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు ట్యాబ్లాయిడ్‌లు అందుబాటులోకి తెస్తానని తెలిపారు. గురుకుల పాఠశాలలకు సమానంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకొక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు.
     అనంతరం శివయ్యస్థూపం సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
     మండల కేంద్రమైన శావల్యాపురం  జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ‘జన్మభూమి-మాఊరు’  కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గ్రామ సర్పంచ్  అధ్యక్షత వహించారు.

     ఈ సందర్భంగా సీఎం 121 డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.5 కోట్ల రుణాల చెక్కు అందజేశారు.
     ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ నియోజకవర్గానికి తాగునీటి సౌకర్యం తీర్చాలని కోరటంతోపాటు సీఎం వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు హామీ ఇవ్వటంపై కృతజ్ఞతలు తెలిపారు.
     రాజధాని నిర్మాణానికి శివశక్తి పౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల చెక్కును ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

     అనంతరం సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దంపతులు ఘనంగా సత్కరించారు. కార్యకర్తలు గజమాలను బహూకరించారు. యువ నాయకులు నాగలిని బహూకరించారు.  
     ఇటీవల ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో తప్పులు ఉన్నాయని పింఛన్‌లు తొలగించిన వయ్యకల్లు, బొందిలిపాలెం, మతుకుమల్లి గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు, రుణమాఫీపై ప్రశ్నించేందుకు వచ్చిన రైతులను సీఎంను కలిసేందుకు అనుమతించలేదు.చివరకు వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు.
     సాగు నీటి సమస్యలతో  రైతులు పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్నా సీఎం ఆ ఊసెత్తకపోవడంతో రైతులు నిరాశకు గుర య్యారు.

     నాగార్జునసాగర్‌లో  పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జోన్ -2 పరిధిలోని పలు ప్రాంతాల్లోని రైతాంగం నాట్లు వేయని దుస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు సైతం సీఎం దృష్టికి తీసుకువెళ్లకపోవడంతో సభలకు హాజరైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
     కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, ఎమ్మెల్సీ నన్నప నేని రాజకుమారి,  పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కుర్రి పున్నారెడ్డి, నలబోలు వెంకట్రామయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ జాన్‌బీ, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.  

 ల్యాండ్ పూలింగ్ విధానానికి సహకరించాలి
 జిల్లాలోని రైతులు ల్యాండ్ పూలింగ్ విధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు.  రేపల్లె నియోజకవర్గం నగరంలో జరిగిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భూసేకరణ విషయంలో జిల్లాలోని రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అనంత రం ముత్తుపల్లిల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.
     చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో యానిమేటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ డివిజన్ నాయకులు సీహెచ్. మణిలాల్  ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

     కార్యక్రమంలో మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, నక్కా అనంద్‌బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు,  జియాఉద్దీన్, జేసీ సీహెచ్. శ్రీధర్, డీఆర్‌డీఏ పీడీ ప్రశాంతి, ఎంపీపీ వి.వీరయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement