ఓయూలో బతుకమ్మ సంబురాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ పాలక భవనం ఎదుట మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలను కన్నుల పండువగా జరుపుకున్నారు. శనివారం ఎన్టీవోల అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బహుజన పోరు బతుకమ్మ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఓయూ క్యాంపస్ కళాశాలలు, కార్యాలయాల ఉద్యోగిణులతో పాటు ఉస్మానియా అనుబంధ కళాశాలల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవోఅధ్యక్షుడు దేవిప్రసాదరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్, విమలక్క, బతుకమ్మ పండుగపై ప్రత్యేక పరిశోధన చేసిన సుజాతశేఖర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేవరకు తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని కోదండరామ్ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వర్సిటీ నాన్‌టిచింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కంచి మనోహార్, రిజిస్ట్రార్ ప్రొ.ఎంఎస్‌ఎన్‌రెడ్డి, ఓఎస్‌డీ ప్రొ.నాగేశ్వర్‌రావు, ఉద్యోగ సంఘాల నాయకులు కంచి మనోహార్, పార్ధపారధి, మల్లేష్, జ్ఞానేశ్వర్, దీపక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణభవన్‌లో బతుకమ్మ సంబురాలు
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ పండుగను నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ మహిళా నేతలు, వివిధ జిల్లాలకు చెందిన మహిళలు పండుగలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం నోట్‌ను కేబినెట్ ఆమోదించడంపై ఈ సందర్భంగా తుల ఉమ హర్షం వ్యక్తంచేశారు.
గాంధీలో తెలంగాణ సంబురాలు
తెలంగాణ మెడికల్ జాక్ గాంధీ యూనిట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాం గణంలో శనివారం తెలంగాణ సంబరాలు అంబరాన్నంటా యి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ఉద్దేశించిన నోట్‌కు కేంద్ర కేబినెట్‌లో ఆమోదం లభించిన నేపథ్యంలో వైద్యు లు, వైద్యవిద్యార్థులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది ఆనందోత్సవాల్లో మునిగితేలారు.