ఆర్టీసీ కార్మికులపై లాఠీ ప్రతాపం
- ఆర్టీసీ కార్మికులపై పోలీసు జులుం
- గాయపడ్డ మహిళా కండక్టర్లు
- మూడో రోజు సమ్మె ఉద్రిక్తం
- బస్సులను అడ్డుకున్న కార్మికులు
- బలవంతంగా బస్సులు నడిపిన పోలీసులు
- అన్యాయమన్న కార్మిక సంఘాలు
న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు శుక్రవారం జులుం ప్రదర్శించారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా దొరికిన వారిని దొరికినట్టే కొట్టి రోడ్డున పడేశారు. పోలీసుల లాఠీల దెబ్బకు పలువురు ఆర్టీసీ కార్మికులు స్పృహతప్పి పడిపోయారు. పలువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనలో పోలీసు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, చిత్తూరు: న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు శుక్రవారం జులుం ప్రదర్శించారు. మహిళా ఉద్యోగినులని కూడా చూడకుండా దొరికిన వారిని దొరికినట్టే కొట్టి రోడ్డున పడేశారు. పోలీసుల లాఠీల దెబ్బకు పలువురు ఆర్టీసీ కార్మికులు స్పృహతప్పి పడిపోయారు. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనలో పోలీసు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం ఒత్తిడితో గురువారం నుంచే బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు యత్నించారు. ఆ మేరకు కాంట్రాక్ట్ కార్మికులపై ఒత్తిడి పెంచారు. ఆటోడ్రైవర్లతో బస్సులు నడిపించాలని చూశారు. ఆర్టీసీ కార్మికులు వారిని అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బంద్ ప్రభావం కనిపించకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు పోలీసు బలగాల అండతో శుక్రవారం బస్సులను బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేయడంతో ఘర్షణ తలెత్తింది.
సమ్మె విఫలం కాకూడదన్న ఉద్దేశంతో ఉన్న కార్మికులు మండుటెండను సైతం లెక్కచేయక బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా మోహరించిన పోలీసులు కార్మికులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఊహించని ఈ ఘటనలో పలువురు కార్మికులు దెబ్బలు తినాల్సి వచ్చింది. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా మగ పోలీసులతో పాటు మహిళా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ దాడిలో కండక్టర్లు ఉష, నిత్య తీవ్రంగా గాయపడ్డారు.
నిత్య చెవి నుంచి రక్తస్రావం ఆగలేదు. పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడమేగాక ఏకంగా పోలీసు స్టేషన్‌ను ముట్టడించి గంట పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసేవరకు వచ్చింది. గాంధీబొమ్మ సెంటర్‌లో రాస్తారోకోతో గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. దాడికి పాల్పడ్డ పోలీసులను సస్పెండ్ చేయాలంటూ యూనియన్ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.