అతలాకుతలం | Bay of Bengal in the district of rain lashed several areas. | Sakshi
Sakshi News home page

అతలాకుతలం

Published Thu, Sep 12 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

Bay of Bengal in the district of rain lashed several areas.

సాక్షి, కడప : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన వర్షం జిల్లాలోని పలు ప్రాంతాలను కుదిపేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జిల్లా అతలాకుతలమైంది.  వంకలు, వాగులు ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
 
 చెరువులకు గండ్లు పడ్డాయి.  కొసినేనిపల్లె వంక ఉధృతంగా ప్రవహించడంతో ఎర్రగుంట్ల మండలం కలమల్ల కృష్ణానగర్ దళితవాడకు చెందిన  రామసుబ్బమ్మ అనే మహిళ మృతి చెందింది.రామలక్షుమ్మ అనే మరో మహిళ   గల్లతైంది. 50 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 150 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆర్టీపీపీలోని ఈఎస్‌పీ, కోల్‌ప్లాంట్, మెయిన్ ప్లాంట్‌లోకి నీరు చేరింది.  మోటార్లు  పూర్తిగా నీట మునిగాయి. మరో 10 రోజుల వరకు విద్యుత్ ఉత్పత్తిని  పునరుద్దరించే అవకాశాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు.  
 
 ఐదు యూనిట్లలో 1050మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ముంపు గ్రామాల్లోకి  శ్రీనివాసపురం రిజర్వాయర్ నీరు చేరింది.  సుండుపల్లె,చిన్నమండెం, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లోని పలు చెరువులు పూర్తిగా నిండగా,కొన్నింటికి గండ్లు పడ్డాయి.  జిల్లాలో అత్యధికంగాప్రొద్దుటూరు పట్టణంలో 215.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యానాది కాలనీ పూర్తిగా నీట మునిగింది.
 
  ముద్దనూరులోని కొసినేనిపల్లె వంకలో ఆరుగురు రజకులు చిక్కుకున్నారు. వీరిని పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.   ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముద్దనూరు  దళితవాడ జలమయమైంది. బుధవారం  తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఉదయం  7 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ముద్దనూరు చుట్టుపక్కల ఉన్న  పుల్లేరు వంక, కొసినేనిపల్లె వంక, కాయవంక పారడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
 
  ఎర్రగుంట్ల మండలం  కృష్ణానగర్ దళితవాడలోకి  కొసినేనిపల్లె వంక, సిరిగేపల్లె చెరువు , ఆర్టీపీపీ కొండల నుంచి భారీగా నీరు రావడంతో ఇళ్లు కూలి రామసుబ్బమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె మరదలు రామలక్షుమ్మ  గల్లంతైంది. భర్త రాముడు, చెల్లెలు, కుమార్తె  స్థానికుల  సహాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆర్టీపీపీలోని  ఈఎస్‌పీ, కోల్‌ప్లాంట్, మెయిన్‌ప్లాంట్‌లోకి నీరు చేరి మోటార్లు  పూర్తిగా నీట మునగడంతో పది రోజులపాటు విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. పొట్లదుర్తి, కల్లమల,చిలంకూరు, మాలేపాడు వంకలు పొంగి ఉధృతంగా ప్రవహించాయి. ఆయా ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కోనశశిధర్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ఆర్డీఓ వీరబ్రహ్మం పరిశీలించారు.  మృతి చెందిన మహిళ, గల్లంతైన మహిళ కుటుంబ సభ్యులకు తాత్కాలిక సహాయం కింద రూ. 10వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అందజేశారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2 వేలు చొప్పున సహాయాన్ని అందించారు.
 
  ప్రొద్దుటూరులో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో  అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీల కారణంగా  రోడ్లపైనే మురికి నీరు పొంగి ప్రవహించింది. మున్సిపల్ కార్యాలయం, కోర్టు, త్రీ టౌన్ పోలీసుస్టేషన్, అగ్నిమాపక కేంద్రం నీటమునిగాయి. యానాదికాలనీ పూర్తిగా నీటిలో చిక్కుకుపోవడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. వైఎస్సార్‌సీపీనేత రాచమల్లు ప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొర్రపాడు వద్ద నల్లవాగు, గోపవరం వద్ద కేసీ కెనాల్ ఉప్పవాగువంక భారీగా ప్రవహించడంతో ప్రొద్దుటూరుపట్టణానికి మధ్యాహ్నం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నాకు భారీగా నీరు చేరడంతో నది ప్రవహించింది. రాజుపాలెం, చాపాడులో భారీ వర్షం కురవడంతో వరి, పత్తి, పసుపు  పంట నీట మునిగింది. రైతులకు తీవ్ర నష్టం సంభవించింది.
 
  కొండ ప్రాంతం నుంచి భారీగా వర్షపు నీరు చేరడంతో మైలవరం దక్షిణ కాలువ రెండుచోట్ల కొట్టుకుపోయింది. కన్యతీర్థంలో మనిషిలోతు నీరు ప్రవహించింది. అక్కడున్న 15 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. జమ్మలమడుగు-ముద్దనూరు మధ్య రాకపోకలు స్తంభించాయి.
 
  సంబేపల్లె మండలంలోని పది చిన్న కుంటలు తెగిపోయాయి. దేవపట్ల చెరువు తెగిపోయింది.  దాలం చెరువుకు పదిచోట్ల గండ్లుపడ్డాయి. తద్దికూలవంక ఉధృతంగా ప్రవహించడంతో రాయచోటి-రాజంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు గ్రామాలైన పాతవటంపల్లె, కొత్తవటంపల్లె, బండకింద పురుగుపల్లెలోకి  శ్రీనివాస రిజర్వాయర్ నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
  పులివెందుల మండలం బెస్తవారిపల్లె సమీపంలో పీబీసీ కాలువ కోసుకుపోయింది. వేముల మండలం కొండ్రెడ్డిపల్లె చెరువుకు గండి పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.మబ్బుచింతలపల్లె, ఆర్.తుమ్మలపల్లెలో కొండపై నుంచి వర్షపు నీరు భారీగా రావడంతో 80 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా దెబ్బతింది.దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం సంభవించింది.
  బద్వేలులోని ఆర్టీసీ డిపోను వర్షం నీరు చుట్టుముట్టింది. డిపోలోని బస్సులు నీటిలో మునిగాయి.
 
 40 మి.మీ.పైగా వర్షపాతం నమోదైన మండలాలు
 జిల్లాలో 40మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం 20 మండలాల్లో నమోదైంది. అందులో కమలాపురం, ఎర్రగుంట్ల, వీఎన్ పల్లె,చిన్నమండెం, సంబేపల్లె, బద్వేలు, గోపవరం, బి.మఠం, జమ్మలమడుగు, మైలవరం, ముద్దనూరు, ప్రొద్దుటూరు,చాపాడు, దువ్వూరు,రాజుపాలెం, దువ్వూరు, లింగాల, వేంపల్లె, వేముల, తొండూరు  ఉన్నాయి.
 
 20-40 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం ఎనిమిదిమండలాల్లో నమోదు కాగా, అందులో రాయచోటి, చక్రాయపేట, రామాపురం, గాలివీడు, పెద్దముడియం, కొండాపురం, మైదుకూరు, సింహాద్రిపురం ఉన్నాయి. అలాగే 20 మి.మీ.లోపు వర్షపాతం నమోదైన మండలాలు 15 ఉన్నాయి. అందులో వల్లూరు, కడప, పెండ్లిమర్రి, చెన్నూరు, ఖాజీపేట, వీరబల్లి, సుండుపల్లె, ఎల్‌ఆర్ పల్లె, గాలివీడు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, బి.కోడూరు, కలసపాడు, సిద్దవటం, అట్లూరు ఉన్నాయి. ఇదిలా ఉండగా రాజంపేట, నందలూరు, పెనగలూరు, చిట్వేలి, పోరుమామిళ్ల, కాశినాయన, ఒంటిమిట్ట మండలాల్లో వర్షం కురువలేదు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement