కుండపోతగా కురుస్తున్న వర్షాలు రైతులకు గుండెకోత మిగుల్చుతున్నాయి. కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికందాల్సిన పంటలు చేలోనే నేలవాలుతున్నాయి. మొలకెత్తకుండానే బుడ్డశనగ కుళ్లిపోతోంది. అరటి,టమోటా పంటలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో చేనేత కార్మికులు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. ఇళ్లల్లోకి నీరు రావడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.
సాక్షి, కడప : జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతన్నను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈశాన్య రుతు పవనాలు చురుగ్గా కదలడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో 24 గంటలపాటు జిల్లాలో వర్షాలు కరిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పెన్నా, కుందూ, సగిలేరు నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. వంకలు, వాగులు, పొంగి ప్రవహిస్తున్నాయి. పోరుమామిళ్ల డివిజన్‌లోని చెరువులు పూర్తిగా నిండాయి. బుడ్డశనగ రైతులకు వర్షాలు తీరని నష్టాన్ని కలిగించాయి. పంట చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, వేరుశనగ పంటలపై వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. 19,680 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 69 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, 152 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
పరవళ్లు తొక్కుతున్న నదులు
పెన్నానది 36,500 క్యూసెక్కుల నీటి పరిమాణంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదినిమ్మాయపల్లె వద్ద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రెండు గేదెలు కొట్టుకుని పోయాయి. సగిలేరుకు భారీగా వరదనీరు చేరుతుండటంతో లోయర్ సగిలేరు ప్రాజెక్టు నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు, బి.కోడూరు మండలాల్లోని అన్ని చెరువులు దాదాపు పూర్తిగా నిండాయి. కాశినాయన మండలం చెన్నవరం, కలసపాడు మండలం దూలంవారిపల్లె చెరువులకు గండ్లు పడ్డాయి. ఇరిగేషన్ ఎస్‌ఈ రమేష్ చెరువులను పరిశీలించి గండ్లు పూడ్చే యత్నం చేస్తున్నారు.
కోలుకోలేని దెబ్బ
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో 50 వేల ఎకరాలు, రాజుపాళెం మండలంలో 2500, వేంపల్లెలో 1000 ఎకరాల్లో బుడ్డశనగ పంట మొలక దశలోనే పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో రూ. 10 కోట్లకు పైగానష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సగిలేరు రక్షణ గోడలకు నాలుగు చోట్ల గండ్లు పడడంతో రాజుపాలెం, అప్పరాజుపేట, ఎర్రబల్లె ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి పంటలు నీట మనిగాయి. దీంతో రూ. 5 కోట్ల నష్టం వాటిల్లింది. కలసపాడు మండలంలో నాలుగు వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతినగా రూ. 2.5 కోట్ల నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. కేవలం 19,680 హెక్టార్లలో మాత్రమే పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
ఉద్యాన పంటలకు తెగుళ్లు
ఈ వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉల్లి, టమోటా పంటలు నీట మునగడంతో తెగుళ్లు ఆశిస్తున్నాయి. అరటికి సిగటోకా, పూల తోటలకు ఆకుమచ్చ తెగులు ఆశిస్తున్నాయి.
కష్టం.. నష్టం..
Published Fri, Oct 25 2013 2:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement