జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం కురిసిన చినుకులు ఎండుముఖం పట్టిన పంటలకు పన్నీరు జల్లులే అయ్యూయి.
కడప అగ్రికల్చర్ : జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం కురిసిన చినుకులు ఎండుముఖం పట్టిన పంటలకు పన్నీరు జల్లులే అయ్యూయి. ఈ రబీ సీజన్‌కు సంబంధించి దాదాపు 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఇప్పటికే వాడిపోయూయి. మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ వర్షాలు పడుతుండడంతో పంటలకు కాసింత ఊపిరి వ చ్చినట్లు అవుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని జమ్మలమడుగు, మైలవరం, చాపాడు, రాజపాళెం, మైదుకూరు, దువ్వూరు మండలాల్లో ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. బుడ్డశనగ, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేసిన రైతులు కాసింత ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో ఈ రబీలో బుడ్డశనగ 52022 హెక్టార్లు, పెసర 4476 హెక్టార్లు, మినుము 5020 హెక్టార్లు, ఉలవ 2447 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 5944 హెక్టార్లలోనూ, నువ్వుల పంట 9004 హెక్టార్లలోనూ సాగు చేశారు. అలాగే ధనియాల పంట 17,200 హెక్టార్లలో సాగైంది.
ఈ పంటల్లో బుడ్డశనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఉలవ పంటలకు ప్రస్తుతం వర్షం చాలా అవసరం. రాయచోటి, పులివెందుల నియోజకవర్గాల్లో వర్షాభావంతో ఇప్పటికే బుడ్డశనగ, ధనియాలు, ఉలవ, ప్రొద్దుతిరుగుడు పంటలు పూర్తిగా ఎండుదశకు చేరుకున్నాయి. రాజుపాలెం, చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పెసర, మినుము పంటల నూర్పిళ్లు చేస్తున్నారు. ఈ చిరు జల్లులు ఈ నూర్పిళ్లను ఏం చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.