జిల్లాలో వర్షాలకు రహదారులు ఛిద్రమయ్యాయి. ప్రధాన రోడ్లు మొదలుకొని పల్లెబాటల వరకు ఎటుచూసినా గుంతలే. వాహదారులు ఏమాత్రం అజాగ్రత్త వహించినా గోతుల్లో పడి గాయాలపాలు కాక తప్పదు. గుంతలతోపాటు కంకర తేలిన రోడ్లు ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపుతున్నాయి.కొన్ని చోట్ల అయితే గుంతలు మడుగులను తలపిస్తున్నాయి. వీటిపై ప్రయాణం అంటేనే ప్రజలు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో దెబ్బతిన్న రహదారులపై
కడప సిటీ : ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అధికారులు వీటికి సంబంధించిన నివేదికలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.వేంపల్లె పాపాఘ్ని నదిలో ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. వేంపల్లె నుంచి అలిరెడ్డిపల్లె, దిగువ తువ్వపల్లె, ఎగువ తువ్వపల్లె గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంబంధించి కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి డివిజన్ల పరిధిలో పలుచోట్ల వంకలు, వాగులు పొంగి పొర్లడంతో అక్కడున్న కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి.
మొత్తం ఆర్‌అండ్‌బీ రోడ్లు జిల్లా వ్యాప్తంగా 4880 కిలోమీటర్ల మేర ఉన్నట్లు అధికారుల అంచనా!. రాయచోటి, జమ్మలమడుగు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయని ఎస్‌ఈ గణపతి వెంకటేశ్వరరావు తెలిపారు.160 కిలోమీటర్ల మేర సర్పేస్ డ్యామేజ్, మరో 30 ప్రాంతాల్లో కోతకు గురయ్యాయని తెలిపారు. తొమ్మిది ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయని తెలిపారు. 23 సీడీ కల్వర్టులు దెబ్బతిన్నాయని వివరించారు. అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీలైనచోట్ల మరమ్మతులు చేశామని ఆయన వివరించారు.
∙కడప డివిజన్‌కు సంబంధించి 800 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి.నాలుగు రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. పెండ్లిమర్రి మండలం వెయ్యినూతులకోన, రేడియోస్టేషన్ సమీపంలో రోడ్లు, , మరో రెండు వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
∙రాజంపేట డివిజన్‌లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర ఆర్‌ండ్‌బీ రోడ్లు ఉన్నాయి. వీరబల్లి–గడికోట రోడ్డు ప్రాంతంలో కాజ్‌వే దెబ్బతింది. ఆ డివిజన్‌లోనే మరొక ప్లీడర్ రోడ్డు దెబ్బతిందని అధికారులు తెలిపారు.కాజ్‌వే పనుల కోసం నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని ఆర్‌ండ్‌బీ అధికారులు తెలిపారు.
∙పులివెందుల డివిజన్ పరి«ధిలో 1300 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వీఎన్ పల్లె మండలం పాలగిరిరోడ్డు సమీపంలో చాగలమర్రి–వేంపల్లె రహదారికి సంబంధించి రోడ్డు దెబ్బతిందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ బ్రీచర్స్ (తారు లేచిపోవడం) పడ్డాయని తెలిపారు.కృష్ణంగారిపల్లె, అగడూరు, మురారిచింతలపల్లె ప్రాంతాల్లో రెండు కల్వర్టులు కూడా డ్యామేజ్ అయ్యాయని వివరించారు.
తాత్కాలిక మరమ్మతుల కోసం రూ. 40 లక్షలు అవసరమవుతాయన్నారు.శాశ్వత పరిష్కారం కోసం రూ. 2 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపామని అధికారులు తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్ పరి«ధిలో 1200 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి. ఇటీవల వచ్చిన వరదల వల్ల దాదాపు 20 చోట్ల రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.అల్లాడుపల్లె దగ్గర నుంచి బీచువారిపల్లెకు వెళ్లే రహదారిలో ఉన్న కల్వర్టు దెబ్బతిందని అధికారులు తెలిపారు.
ఎన్‌హెచ్ రోడ్డు
కడపజిల్లాలో నేషనల్ హైవేరోడ్డు దాదాపు 230 కిలోమీటర్ల మేర ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు మైదుకూరు–పోరుమామిళ్ల రహదారితోపాటు మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ రోడ్లు దెబ్బతిన్నాయని ఈఈ ఓబుల్‌రెడ్డి తెలిపారు. ఇయర్లీ మెయింటెన్స్ కింద వీటిని బాగు చేయిస్తామని తెలిపారు.
దెబ్బతిన్న గ్రామీణ రోడ్లు: రూ. 9.30 కోట్ల మేర నష్టం
జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌శాఖ కు సంబంధించి చాలాచోట్ల వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల రూ.9.32 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. చిట్వేలి మండలంలోని నేతివారిపల్లె దలగ్గర వున్న కాజ్‌వే తెగి పోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కె.రాజుపాలెం మండలంలోని రాజుపాలెం–అయ్యవారిపల్లె మడుగువంకపై వున్న కాజ్‌వే దెబ్బతింది.కాజ్‌వేపై ఉన్న పైపులపై వరదనీటికి మట్టి కొట్టుకు పోవడంతో రాళ్లు బయటపడ్డాయి. ఇప్పటికే జిల్లా కార్యాలయానికి నివేదికలు పంపినట్లు ఆయా మండలాల పంచాయతీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment