గోరుచుట్టుపై రోకలిపోటు అంటే ఇదే.. ఇప్పటికే తెగుళ్లబారిన పడిన పంటలను దక్కించుకునేందుకు పురుగుమందులు వాడుతూ అవస్థలు పడుతున్న రైతన్నలను వరుణుడు కోలుకోలేని దెబ్బతీశాడు. ఆరురోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. చెంపేటు... గోడేటు తగిలినట్లు తెగుళ్లు, వర్షం దెబ్బతో పూర్తిగా పంట చేతికి దక్కుకుండా పోవడంతో రైతన్న ‘పంటశోకం’తో తీవ్ర వేదన పడుతున్నాడు. గతేడాది అనావృష్టి, ఈ ఏడాది అతివృష్టితోకోలుకోలేని దెబ్బ తగిలింది.
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని కొండంత ఆశతో అన్నదాతలు పంటలు సాగు చేశారు. అయితే ఎడతెరిపి లేని వర్షాలతో వాణిజ్య, ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వేంపల్లె,ముద్దనూరు, చిన్నమండెం, రాయచోటి, చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల, వేముల, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, చాపాడు తదితర మండలాల్లో వరి, వేరుశనగ, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న పంటలకు మోసులు వచ్చాయి.
చామంతి, చాందినీ చామంతి, బంతి, టమోట, మిరప,ఉల్లి పంటలకు తెగుళ్లు, పురుగులు ఆశించాయి. వర్షం, తెగుళ్లతో 25480 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలన్నీ ప్రస్తుతం నూర్పిళ్లు అవుతుండటంతో వర్షాల కారణంగా ఏ పంటనూ కాపాడుకోలేని నిస్సహాయస్థితిలో రైతన్న ఉండిపోయాడు. పంటలు మంచి దిగుబడినిస్తాయని పిల్లల చదువులు, పెళ్లిళ్లకు అండగా ఉంటుందని ఆశించిన రైతన్నకు నిరాశే మిగిలింది.
కదిలిస్తే క న్నీరే..
Published Sun, Oct 27 2013 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement