2014 పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 150 అసెంబ్లీ, 22 ఎంపీ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో ఈ నెల 12న బీసీ గర్జన పేరుతో మహాసభ నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: 2014 పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 150 అసెంబ్లీ, 22 ఎంపీ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో ఈ నెల 12న బీసీ గర్జన పేరుతో మహాసభ నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. అదేవిధంగా 20న విజయవాడలో, 23న ఖమ్మంలోనూ మహాసభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన సంఘం సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రూ. 20 వేల కోట్లతో సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు.
బీసీలు రాజ్యాధికారం సాధించాలి: బీసీలు రాజ్యాధికారం సాధించే దిశగా పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బీసీ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేదల వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ర్యాగ రమేష్, సంఘం గ్రేటర్ కార్యదర్శి మధుసూదన్‌రావు, ప్రధాన కార్యదర్శి కానుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.