పార్లమెంటులో బీసీల గొంతు వినిపిస్తాం
జంతర్ మంతర్‌లో రెండో రోజూ కొనసాగిన దీక్ష
టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ నేతల మద్దతు
న్యూఢిల్లీ: పార్లమెంటులో బీసీల గొంతు వినిపిస్తామని పలు రాజకీయ పార్టీల ఎంపీలు హామీ ఇచ్చారు. ప్రధాని నరేం ద్ర మోడీకి బీసీల సమస్యలు నివేదిస్తామని భరోసా ఇచ్చారు. బీసీల ఓట్లతో పార్లమెంటుకు వచ్చిన తాము వారి డిమాండ్లు పరిష్కరించి రుణం తీర్చుకుంటామన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సం ఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్ష, ప్రదర్శన రెండో రోజు మంగళవారం కూడా కొనసాగాయి. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్, క్రాంతిదళ్ పార్టీలు వీటికి మద్దతు తెలిపాయి. టీఆర్‌ఎస్ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్ మాట్లాడుతూ.. బీసీల ఉద్యమానికి టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుండు సుధారాణి, మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీసీ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడితే తొలి ఓటు తామే వేస్తామన్నారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఓబీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ తరహాలోనే బీసీలకు కూడా అన్ని అధికారాలూ ఉండేలా చట్టబద్దత కల్పించాలన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ.. బీసీల ఉద్యమానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని, బీసీల సమస్యలను పెద్దల సభలో లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల న్యాయమైన డిమాండ్లను ఎన్డీయే ప్రభుత్వం పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని లేనిపక్షంలో అంతర్జాతీయ వేదికగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం నేత కె. ఆల్మన్‌రా జు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ఆర్.రమేష్, కె.వెంకటేశ్ గౌడ్, రెడ్డిమళ్ల వెంకటేశ్వర్లు, మల్లేష్ యాదవ్, భాగ్యలక్ష్మి, లక్ష్మి, శారద, అశోక్ గౌడ్, మహేష్, రాజేందర్, ఎన్నం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.