ఆయన ప్రధానైతే రిజర్వేషన్లు పోతాయి: కంచ ఐలయ్య
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రధాని అయినపక్షంలో బీసీలకు ఇపుడున్న రిజర్వేషన్లు పోతాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి బీసీ మోడీని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారమిక్కడ ఆంధ్రా సారస్వత పరిషత్‌లో ‘బహుజన సెక్యులర్ మూవ్‌మెంట్’(బీఎస్‌ఎం) ఆధ్వర్యంలో ‘సెక్యులరిజానికి జీవం పోద్దాం.. భిన్నత్వాన్ని కాపాడుకుందాం.. మోడీని ఓడిద్దాం.. దేశాన్ని రక్షిద్దాం’ అన్న అంశంపై మహాచర్చ నిర్వహించారు. ఐలయ్య మాట్లాడుతూ.. మోడీ ప్రధాని అయితే ముస్లింలకు, క్రిస్టియన్లకు ప్రమాదం ఉండదని, బీసీలకు మాత్రమే ప్రమాదమని అన్నారు. మోడీ ఇప్పటివరకు ఏనాడూ తాను బీసీనని చెప్పుకోలేదని, ప్రధాని పదవి దక్కించుకునేందుకే ఇప్పుడు బీసీనని చెప్పుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెడుతున్న మోడీ.. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టేందుకు మాత్రం సుముఖంగా లేరన్నారు. బ్రాహ్మణ పెట్టుబడిదారులకు రిజర్వేషన్లపై వ్యతిరేకత ఉందని, బ్రాహ్మణీయుల బానిసైనమోడీని ప్రధానిని చేసి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తారని ఐలయ్య ఆరోపించారు. ఢిల్లీలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని బీఎస్‌ఎం తరపున ప్రతిపాదించారు. సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ భంగ్యా భూక్యా, జమీలా నిషాత్, ఖాదర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలు మోడీని వ్యతిరేకించాలి
Published Mon, Feb 10 2014 2:56 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement