న్యూఢిల్లీ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 114వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో జెండా ఊపి ‘రన్ ఫర్ యూనిటీ’ మారదాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ఏక్ భారత్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని, దేశ ప్రజలందరినీ ఒకే తిరంగా జెండా కింద ఉంచడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
దేశం బలోపేతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అయితే అది సాధ్యం కావాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండాలని మోదీ అన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి పటేల్ చేసిన కృషి శ్లాఘనీయమని, దానిని ఎప్పటికీ మరచిపోరాదని మోదీ అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రతిజ్ఞ చేయించిన ప్రధాని, దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటానికి మరింత శ్రమించాలని పిలుపునిచ్చారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ డిజిటల్ మ్యూజియమును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు.
కాగా అంతకు ముందు ప్రధాని మోదీ... మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు.