బెజవాడ స్వచ్ఛ ర్యాంకెంతో?
జనవరి 2 నుంచి స్వచ్ఛభారత్ మిషన్ సర్వే
ఫోన్ల ద్వారా అభిప్రాయాల సేకరణ
ర్యాంకింగ్‌ను బట్టి ప్రోత్సాహకాలు
విజయవాడ సెంట్రల్ : స్వచ్ఛభారత్ మిషన్ సిటీ ర్యాంకింగ్ సర్వేకు రంగం సిద్ధం చేసింది. దేశంలో మొత్తం 75 నగరాలను ఎంపిక చేయగా రాష్ర్టంలో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు కార్పొరేషన్లను ఎంపిక చేశారు. ది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్వే ఏజెన్సీ జనవరి రెండో తేదీ నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనుంది. ఈక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు మూడు సర్కిళ్ల పరిధిలో 18 ప్రాంతాలను ఎంపిక చేశారు. మురికివాడలు, కొండప్రాంతాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు అందులో చోటు కల్పించారు. సర్వే ఏజెన్సీ నిర్వాహకులు ఫోన్ ద్వారా కూడా అభిప్రాయసేకరణ చేయనున్న నేపథ్యంలో నగరంలో పదివేల ఫోన్ నంబర్లను ప్రజారోగ్యశాఖ అధికారులు సర్వే ఏజెన్సీకి అందించారు.
సర్వే ఇలా
బహిరంగ మల, మూత్ర విసర్జన, వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయ్‌లెట్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, వాణిజ్య కేంద్రాల్లో టాయ్‌లెట్స్ నిర్మాణం, ఇంటింటి చెత్త సేకరణ, రోడ్లు పరిశుభ్రం చేయడం, శాస్త్రీయ పద్ధతిలో చెత్త తరలింపు, బిహేవియర్ బేస్డ్ కమ్యూనికేషన్, పబ్లిక్ టాయ్‌లెట్స్ పరిశుభ్రత, మురికివాడల అభివృద్ధి, రవాణా అంశాలపై ప్రధానంగా సర్వే చేయనున్నారు. 18002672777 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. వచ్చిన ర్యాంకింగ్ ఆధారంగా సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు.
అధ్వానం..
నగరంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఇంటింటి చెత్త సేకరణ 40 శాతానికి మించడం లేదు. 6,500 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని గతంలో అధికారులు నిర్ణయించగా స్థలాభావం కారణంగా 1,150 మాత్రమే నిర్మాణం చేశారు. కమ్యూనిటీ టాయ్‌లెట్స్ నిర్వహణ గాలికి వదిలేశారు. చెన్నై తరహాలో రాఘవయ్య పార్క్‌లో నిర్మాణం చేసిన నమ్మా టాయ్‌లెట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో అధికారులు విఫలమయ్యారు. ఏలూరు, బందరు రోడ్లను చెత్త రహిత రోడ్లగా తీర్చిదిద్దాలన్న ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. శివారు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. మురికివాడలు కనీస వసతులకు ఆమడదూరంలో ఉన్నాయి. ఈక్రమంలో నగరం ర్యాంకింగ్‌లో వెనుక బడుతోందనే భయం అధికారుల్ని వెంటాడుతోంది.